Prashanth Neel: ‘కె.జి.ఎఫ్ దర్శకుడు తెలుగు వాడే.. ప్రశాంత్ నీల్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్..!
April 20, 2022 / 07:24 PM IST
|Follow Us
‘కె.జి.ఎఫ్2’ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది.కన్నడ సినిమాల పరిమితుల్ని చెరిపేస్తూ.. సంచలనాలు సృష్టిస్తుంది. కన్నడ కంటే ఎక్కువగా హిందీలో అలాగే తెలుగులో ఈ మూవీ భారీ వసూళ్ళు సాధిస్తుంది. ఈ వీకెండ్ కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ తో హీరో యష్ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ‘కె.జి.ఎఫ్ 2’ కి వచ్చేసరికి దర్శకుడు ప్రశాంత్ నీల్ బాగా పాపులర్ అయ్యాడు.
‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ రిలీజ్ అయినప్పుడు ఇతను చాలామంది తెలుగు హీరోలకి కథలు చెప్పడానికి వెళ్ళాడు. ఒక్క ప్రభాస్, ఎన్టీఆర్ తప్ప మిగిలిన హీరోలెవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ‘కె.జి.ఎఫ్ 2’ విడుదల తర్వాత ఇతని కాల్షీట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆ రిజెక్ట్ చేసిన హీరోలకి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ నీల్ తెలుగువారే అనే వార్త గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే… ఇటీవల ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
అందులో ‘హీరో తల్లి సమాధిని బొంబాయి నుండీ కేజీఎఫ్ కు తీసుకొచ్చి అక్కడ సమాధి కట్టించడం పై ప్రశ్న ఎదురైంది. ఈ ఐడియా ఎలా వచ్చింది అనే అంశం పై ప్రశాంత్ స్పందిస్తూ.. “అది నా రియల్ థాట్.కానీ ప్రాక్టికల్ గా కుదరదు అని సినిమాలో పెట్టుకున్నాను.మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. నేను ఎంత తిట్టినా ఆమె నాతోనే ఉండేది. నేను తినకపోతే దగ్గరుండి మరీ తినిపించేది.
ఎప్పుడైతే ఆమె చనిపోయిందో.. తన అంత్యక్రియలు జరిపించడానికి మాకు ఇక్కడ(కర్ణాటకలో) సొంత స్థలం లేదు. వేరేదారి లేక ఆంధ్రప్రదేశ్ లోని మా సొంతూరులో అంత్యక్రియలు జరిపించాం. ఏదొక రోజు ఆమె సమాధిని అలాగే తీసుకొచ్చి మా ఇంటి వాకిట్లో పెట్టుకోవాలని అప్పుడే అనుకున్నాను. అలా అనుకున్న ఐడియానే నా సినిమాలో వాడుకున్నాను. ఇప్పటికీ ఆమెను మిస్ అవుతూనే ఉన్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇతని సొంత ఊరు అని ప్రశాంత్ నీల్ అనడంతో ఇతను తెలుగువాడే అని అంతా సంతోషపడుతూ మనోడే అని కామెంట్లు పెడుతున్నారు.