ప్రేమకథాచిత్రమ్ 2

  • April 12, 2019 / 11:54 AM IST

2013లో విడుదలై సంచలన విజయం సాధించిన “ప్రేమకథాచిత్రం” గురించి తెలియనివారుండరు. 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 30 కోట్లు వసూలు చేసిన కొన్ని వందల తెలుగు సినిమాలకు ఊతమిచ్చింది. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సీక్వెల్ కు హరికిషన్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడాదికాలంగా విడుదలకు ఇబ్బందిపడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ ఉగాది సందర్భంగా విడుదలైంది. మరి ప్రీక్వెల్ రేంజ్ లో ఈ సీక్వెల్ ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ: సుధీర్ (సుమంత్ అశ్విన్) ఓ సగటు కాలేజ్ యువకుడు. బిందు (సిద్ధి ఇద్నాని) మనోడ్ని లవ్ చేస్తుంది.. కానీ అప్పటికే నందు (నందిత శ్వేత)లో పీకల్ళోకు ప్రేమలో ఉన్న సుధీర్ తనను ఘాడంగా ప్రేమిస్తున్న బిందు లవ్ ను పబ్లిక్ గా రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆత్మహత్య చేసుకొని మరణించిన బిందు ఆత్మ నందులోకి ప్రవేశిస్తుంది. దాంతో సుధీర్ జీవితంలో రచ్చ మొదలవుతుంది.సుధీర్ ఈ ఆత్మ గోల నుంచి బయటపడగలిగాడా? లేదా? అనేది “ప్రేమకథా చిత్రమ్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: మామూలుగానే సుమంత్ అశ్విన్ నటన సోసోగా ఉంటుంది. ఈ సినిమాలో యాక్టింగ్ చేయకుండా ఓవర్ యాక్టింగ్ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఇక క్లైమాక్స్ లో దెయ్యంలా బాబు పెర్ఫార్మెన్స్ కి “వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డ్ ఇచ్చేసినా తప్పులేదు.మెథడ్ యాక్టర్ అయిన నందిత శ్వేతతో కూడా ఓవర్ యాక్షన్ చేయించిన ఘనత ఈ చిత్ర దర్శకుడికే చెందుతుంది. ఒక్క నందిత శ్వేత మాత్రమే కాదు.. సిద్ధి ఇద్నాని, అపూర్వ శ్రీనివాసన్, కృష్ణతేజ, విద్యుల్లేఖ రామన్ ఇలా ప్రతి ఒక్కరూ అతి చేసి ప్రేక్షకులతో బాసెక్ట్ బాల్ ఆడుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ మరో సాంకేతికపరమైన అంశం లేదంటే అది అతిశయోక్తి కాదు. జె.బి సంగీతం-నేపధ్య సంగీతం అవుట్ డేటెడ్ అయిపోగా.. నిర్మాణ విలువలు కూడా సోసోగా ఉన్నాయి.ఫస్ట్ పార్ట్ లో సుధీర్ బాబు పోషించిన క్యారెక్టర్ కు కంటిన్యూషన్ గా సుమంత్ అశ్విన్ పాత్రను ప్లాన్ చేసుకున్న దర్శకుడు మెయిన్ ట్విస్ట్ ను కూడా బాగానే రాసుకున్నాడు. కానీ.. ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అసలు కథగా ఏం చెప్పాలి అనుకున్నాడు అనే విషయాన్ని ఏదో సర్ ప్రైజ్ చేద్దామని ఫస్టాఫ్ మొత్తం హోల్డ్ చేయడం, సెకండాఫ్ లో సరిగా రివీల్ చేయకపోవడంతో అప్పటికే నీరసించిన ప్రేక్షకుడి నెత్తి మీద గుణపంతో గుద్దాడు.

విశ్లేషణ: హారర్ కామెడీ సినిమా అంటే ఒక ట్విస్ట్, రెండు కామెడీ, ఇద్దరు హీరోయిన్లు ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలాంటి “ప్రేమకథా చిత్రమ్”లు ఇంకో రెండు మూడు వస్తాయి. కాకపోతే.. ఆకట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఈ విషయాన్ని నేటితరం దర్శకులు అర్ధం చేసుకొని హారర్ సీన్స్ కంటే ముందు కథను రాసుకోవడం, ఆ రాసుకున్న కథను తెరపై సరిగా ప్రెజంట్ చేయడం నేర్చుకోవాలి. ఉగాది రోజున ప్రేక్షకులకు చేదు అనుభవంగా మిగిలిపోయే చిత్రమ్ “ప్రేమకథా చిత్రమ్ 2”.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus