Anil Sunkara: ఇంటర్వ్యూ : ‘సామజవరగమన’ చిత్రం రిజల్ట్ గురించి నిర్మాత అనిల్ సుంకర ఆసక్తికర విషయాలు
July 3, 2023 / 10:05 PM IST
|Follow Us
జూన్ 29న రిలీజ్ అయిన ‘సామజవరగమన’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. శ్రీవిష్ణు ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడి.. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :
ప్ర) ‘సామజవరగమన’ సక్సెస్ ను ఎలా ఆస్వాదిస్తున్నారు?
అనిల్ సుంకర : ‘సామజవరగమన’ సక్సెస్ పై నాకు (Anil Sunkara) ముందు నుండీ నమ్మకం ఉంది. ఇది మంచి స్క్రిప్ట్. అందుకే ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ప్ర)’సామజవరగమన’ కి ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునా? లేక వేరే హీరోని అనుకుని కుదరక శ్రీవిష్ణుతో చేశారా?
అనిల్ సుంకర : వాస్తవానికి ఈ స్క్రిప్ట్ ను నా వద్దకి పంపింది సందీప్ కిషన్. అతను ‘మైఖేల్’ అనే యాక్షన్ సినిమా చేస్తుండటంతో డేట్స్ ఖాళీ లేక ఈ స్క్రిప్ట్ నా వద్దకి పంపాడు. అప్పుడు శ్రీవిష్ణుని ఫైనల్ చేశాం. అతను ఈ స్క్రిప్ట్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.
ప్ర)శ్రీవిష్ణు కాకుండా నాని వంటి పెద్ద హీరోలతో చేస్తే ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది కదా అని మీకు అనిపించిందా?
అనిల్ సుంకర : వన్ పర్సెంట్ కూడా అనిపించలేదు. శ్రీవిష్ణుకి ఇది పర్ఫెక్ట్ యాప్ట్. చాలా అద్భుతంగా నటించాడు.. ఇంప్రవైజ్ కూడా చేశాడు. ఇలాంటి కథ మరోసారి చేయాలంటే.. నా ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే. అందులో డౌట్ లేదు.
ప్ర) మీరు సోలో ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాల కంటే కూడా వేరే నిర్మాతలతో అసోసియేట్ అయ్యి చేసిన సినిమాలే ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. దాని పై మీ అభిప్రాయం?
అనిల్ సుంకర : నా మొదటి నాలుగు సినిమాలు సోలోగా చేసినవే. అవి హిట్ అయ్యాయి. అయితే తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవడం, వేరే బ్యానర్లతో అసోసియేట్ అయిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో అందరిలో ఆ అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. ‘మహాసముద్రం’ సినిమా నేను చేయాల్సింది కాదు. కానీ టేకాఫ్ చేయాల్సి వచ్చింది.
ప్ర)’సామజవరగమన’ లో నరేష్ రోల్ బాగా హైలెట్ అయ్యింది. కానీ సెకండాఫ్ లో ఎందుకు ఆయన పాత్ర తగ్గించారు?
అనిల్ సుంకర : నరేష్ గారి పాత్ర కూడా హిలేరియస్ గా వచ్చింది. కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు నరేష్ గారే యాప్ట్ అని భావించి ఆయన కోసం రెండు నెలలు వెయిట్ చేశాం. సెకండాఫ్ లో ఆయన పాత్రని సైడ్ చేసింది అంటూ ఏమీ లేదు. ఆ లోటు కూడా జనాలకి తెలీదు.సెకండాఫ్ లో ఆయన ఎమోషనల్ సన్నివేశాల్లో కనిపించడం వల్ల అలా అనిపించి ఉండవచ్చు.
ప్ర) మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు? టెన్షన్ అనిపించలేదా?
అనిల్ సుంకర : ప్రీమియర్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.రిలీజ్ కి ముందు రోజు నైజాంలో ఇరవై షోలు వేశాం. పది లక్షల షేర్ వచ్చింది. ఇది ఖచ్చితంగా మంచి విజయం. ప్రిమియర్స్ పై మరింత నమ్మకం పెరిగింది.
ప్ర) ‘సామజవరగమన’ కాంబోలో మరో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
అనిల్ సుంకర : సామజవరగమన సక్సెస్ నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఇదే కాంబినేషన్ లో ఇంకో సినిమా ఉంటుంది. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది.
ప్ర) భోళా శంకర్ ఎలా ఉండబోతుంది ?
అనిల్ సుంకర : ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి గారికి యాప్ట్ మూవీ. చిరంజీవి గారు, కీర్తి సురేష్ గారి మధ్య వచ్చే సెంటిమెంట్ ట్రాక్ చాలా బాగా వచ్చింది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 11న సినిమా రిలీజ్ అవుతుంది.
ప్ర) చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
అనిల్ సుంకర : చిరంజీవి గారితో వర్క్ చేయడం అనేది నిజంగా వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో కూర్చున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆయన అనుభవాలతో స్క్రిప్ట్ ను ఇంకా అందంగా వచ్చేలా చేస్తారు.
ప్ర) ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ అయ్యాక మీరు చేసిన ‘బౌండ్ స్క్రిప్ట్’ ట్వీట్ సంచలనం సృష్టించింది. అందుకు కారణం?
అనిల్ సుంకర : ‘ఏజెంట్’ రిజల్ట్ విషయంలో అందరిది తప్పు ఉంది. కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించడానికి లేదు. నేను, సురేంద్ రెడ్డి ఈ సినిమాతో ఒక హీరోని నెక్స్ట్ లెవల్ కి తీసుకెల్దామని అనుకుని మొదలుపెట్టాం. కానీ మేము అనుకున్నది జరగలేదు. నిర్మాతగా ఆ సినిమా ఫలితానికి నేను కూడా భాద్యత వహిస్తాను.
ప్ర) ‘హిడింబ’ ఎలా ఉండబోతుంది?
అనిల్ సుంకర : ‘హిడింబ’ మాకు టేబుల్ ప్రాఫిట్ మూవీ. ఒక్క ట్రైలర్ తోనే మంచి బిజినెస్ అయిపోయింది. ఒక చిన్న సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావడం అంటే చిన్న విషయం కాదు. సబ్జెక్ట్ బాగుంటేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ‘ఊరు పేరు భైరవ కోన’ సబ్జెక్ట్ కూడా బాగుంటుంది.