Tuck Jagadish: ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్‌పై నిర్మాత కామెంట్స్!
September 4, 2021 / 07:28 PM IST
|Follow Us
కరోనా పరిస్థితులు మొదలయ్యాక టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ సినిమాకు జరగనంత రచ్చ ‘టక్ జగదీష్’కి జరుగుతోంది. థియేటర్లలో కాకుండా… ఓటీటీలో విడుదలైన సినిమా ఇదొక్కటే అన్నట్లు అందరూ ఆడిపోసుకున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని తిట్టిపడేశారు థియేటర్లవాళ్లు. అయితే దీనిపై తర్వాత వెనక్కి తగ్గారనుకోండి. అయితే తాజాగా థియేటర్లు – ఓటీటీ విషయంలో సినిమా నిర్మాత సాహు గారపాటి స్పందించారు. కొవిడ్ – 19 మూడో వేవ్ భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రేపు మాపు అంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లో విడుదల చేయడం రిస్క్ అని అన్నారు సాహు గారపాటి. దీనికి ఉదాహరణగా ‘వకీల్ సాబ్’ సినిమా గురించి చెప్పుకొచ్చారు కూడా. సినిమా విడుదలై మంచి టాక్ తో నడుస్తున్నప్పుడు సెకండ్ వేవ్ ఉద్ధృతమైంది. దీంతో సడన్ గా థియేటర్లు మూసేశారు. అలాంటి పరిస్థితే మళ్లీ వస్తే ప్రమాదమే. ఆంధ్రప్రదేశ్‌లో మూడు షోలే నడుస్తున్నాయి. పక్క రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్లు ఇంకా ఓపెనవ్వలేదు. ఓవర్సీస్లో పరిస్థితి ఇంకా దారుణం. ఎవరినో ఇబ్బంది పెట్టాలని ‘టక్ జగదీష్’ను ఓటీటీకి ఇవ్వలేదు. నిజానికి.. ఓటీటీకి వెళ్లడం వల్ల నిర్మాతలుగా మాకే నష్టం. థియేటర్లలో సినిమాకు వచ్చే రెవెన్యూ… ఓటీటీ విడుదల నుంచి రాదు. ‘జాతిరత్నాలు’, ‘ఉప్పెన’ ఎంత వసూలు చేశాయో చూశాం కదా? అంటూ ప్రశ్నించారాయన.
ఎవరికైనా తమ సినిమాను ప్రేక్షకులకు చూపించుకోవాలనే ఉంటుంది కదా అన్నారు సాహు గారపాటి. నిజానికి మా సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. పరిస్థితులు బాగుపడతాయని ఇన్ని రోజులు ఎదురుచూశాం. ఇంకా ఎక్కువ రోజులు సినిమాను హోల్డ్ చేయడం అంతమంచిది కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీకి ఇచ్చాం అని చెప్పారు నిర్మాత సాహు గారపాటి. ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం కథానాయకుడు నానికి కూడా తొలుత నచ్చలేదు. థియేటర్లలోనే విడుదల చేయాలని పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. నిర్మాతల ఒత్తిడితోనే సినిమాని ఓటీటీకి ఇవ్వాల్సివచ్చింది. ఈనెల 10న ‘టక్ జగదీష్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది.