MS Raju: టికెట్ల రేట్లను పెంచడం వల్లే చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది!
June 27, 2022 / 10:16 AM IST
|Follow Us
గత కొంతకాలంగా సినిమా టికెట్ల రేట్లు విషయం పై ఏపీ ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు మధ్య పెద్దఎత్తున వివాదం చెలరేగింది. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని సినిమా టికెట్ల రేట్లు ఏపీ ప్రభుత్వం తగ్గించడంతో సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా మండిపడ్డారు. భారీ బడ్జెట్ చిత్రాలకు సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే నిర్మాతలు నష్టపోవాల్సి ఉంటుందని కొందరు సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి సినిమా టికెట్ల రేట్లు పెంచాలని సూచించారు. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.
అయితే సినిమా టికెట్ల రేట్లను పెంచడం నిర్మాతలకు శాపంగా మారిందని ప్రస్తుతం పలువురు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత ఎం.ఎస్.రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు పెరగడం చిన్న సినిమాలకు శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న సినిమాకు 200 రూపాయల టికెట్లు ఉంటే సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదంటూ వెల్లడించారు. సింగిల్ థియేటర్ లో కూడా చిన్న సినిమాలకు 200 రూపాయల టికెట్ రేట్స్ ఉండటంతో సగటు ప్రేక్షకుడు సినిమాని థియేటర్లో కన్నా ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలా ప్రేక్షకుల థియేటర్ కు రాకపోవడంతో నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో పెద్ద సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు ఇక చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయిందని ఎమ్మెస్ రాజు వెల్లడించారు. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన 7 డేస్ 6 నైట్స్ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ విషయాల గురించి వెల్లడించారు.
ఇలా సినిమా టికెట్ల రేటు అధికంగా ఉండటం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని వీలైనంత త్వరగా సినీ పెద్దలు ప్రభుత్వాలతో చర్చించి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆయన వెల్లడించారు.ఈ విధంగా సినిమా టికెట్ల రేట్లను పెంచి చిన్న సినిమాలను చంపకండి చిన్న సినిమాలను బతకనివ్వండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.