Prudhvi Raj, Pawan Kalyan: ‘భీమ్లా’ను తెగమెచ్చుకున్న వైకాపా నేత, నటుడు పృథ్వీ!
February 27, 2022 / 03:45 PM IST
|Follow Us
‘భీమ్లా నాయక్’ సినిమా మీద, పవన్ కల్యాణ్ మీద మాకెంలాంటి కోపం లేదు. అన్ని సినిమాల్లానే ఆ సినిమాను కూడా చూస్తున్నాం. ‘కక్ష సాధింపా.. కాకరకాయా..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు బీరకాయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాట అన్నది మేం కాదు… సోషల్ మీడియాలో నెటిజన్లు. ఇప్పుడు అదే సినిమా గురించి అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు, నటుడు చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. అంతే కాదు ఏకంగా దిష్టి తగలకూడదు అంటూ కోరుకున్నాడు కూడా.
పృథ్వీరాజ్.. అదేనండీ మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమా చూశారు. ఈ సందర్భంగా సినిమా గురించి తన అభిప్రాయాల్ని ఓ టీవీ ఛానల్‌తో నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. సినిమా తనకు బాగా నచ్చిందని.. పవన్ కల్యాణ్‌కు దిష్టి తగలకూడదు అంటూ చక్కగా చెప్పుకొచ్చారు పృథ్వీ. ఓవైపు ఆయన పార్టీకి చెందిన నాయకులు పవన్ మీద కారాలు మిరియాలు నూరుతుంటే.. ఈయన ఇలా మాట్లాడటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, పవన్ కల్యాణ్ అభిమానులకు నా అభినందనలు. ‘భీమ్లా నాయక్’ చూశాను, అదిరిపోయింది.
నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే అది నందమూరి తారక రామారావు ‘అడవి రాముడు’. ఆ సినిమా విడుదలైనప్పుడు తాడేపల్లి గూడెంలోని విజయ టాకీస్‌కు వెళ్లాను. అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అదుపు చేయడానికి ఆ రోజు పోలీసులు లాఠీచార్జి చేశారు. అలాంటి క్రేజ్ ఎన్టీఆర్ తర్వాత పవన్ కల్యాణ్‌కే అంటూ తెగ మెచ్చేసుకున్నారు పృథ్వీ.
సినిమా క్లైమాక్స్, పవన్ – రానా మధ్య వచ్చిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుడిలా చిత్రాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేశా అని చెప్పారు పృథ్వీ. సినిమా చూస్తున్నంత సేపు నాకో రకమైన బాధేసింది. ‘ఇలాంటి అద్భుతమైన సినిమాలో నేను నటించలేకపోయానే’ అని విచారించాను. చాలా రోజుల తర్వాత పవన్‌ని ఇలాంటి పాత్రలో చూపించారు. దీంతో చాలామంది దిష్టి ఆయనకు తగిలి ఉంటుంది.
ఆయనకు ఎలాంటి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీ. అన్నట్లు ఇటీవల ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా ఉందనుకోండి. మొన్నీమధ్య సినిమా పరిశ్రమ వాళ్లతో జరిగిన మీటింగ్ పార్టీ తరఫు నుండి పోసాని కృష్ణమురళి, అలీ, మహి.వి.రాఘవ వచ్చారు. కానీ పృథ్వీకి పిలుపు అందలేదు అని టాక్.