Lingu Swamy: ‘వారియర్’ దర్శకుడిపై గెలిచిన పీవీపీ సంస్థ
August 23, 2022 / 12:38 PM IST
|Follow Us
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెన్నై కోర్టులో షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌కి జైలు శిక్ష పడింది. కోటి రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సైదాపేట్ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై లింగుస్వామి, అతని సోదరుడు కలసి కొన్ని సినిమాలు నిర్మించారు. ఈ క్రమంలో పీవీపీ సంస్థ దగ్గర అప్పు తీసుకున్నారు. అది తీర్చే క్రమంలో కేసు నమోదైంది.
కొన్నేళ్ల క్రితం పీవీపీ సినిమాస్ నుండి లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. కార్తి, సమంత జంటగా ‘ఎన్ని యేళు నాల్’ అనే సినిమా అనుకున్నారు. దీని కోసం తిరుపతి బ్రదర్స్ నుండి లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్.. పీవీపీ సంస్థ నుండి రూ. కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించే క్రమంలో ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది.
చెక్ బౌన్స్ కేసు సైదాపేట్ కోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు రాగా, విచారించిన న్యాయస్థానం లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీల్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలో దీనిపై సమాచారం వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే చెక్ బౌన్స్ వ్యవహారంలో కోర్టు వరకు ఎందుకొచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక లింగుస్వామి కెరీర్ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పొచ్చు. తమిళంలో వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే తెలుగులో రామ్‌తో ‘వారియర్’ సినిమా చేసి బలంగా రీఎంట్రీ ఇద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయం పాలైంది. లింగుస్వామితోపాటు రామ్‌కి కూడా ఈ సినిమా చేదును మిగిల్చింది.