Raakshasa Kaavyam Review in Telugu: రాక్షస కావ్యం సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 13, 2023 / 12:59 PM IST

Cast & Crew

  • అభయ్ బేతగంటి (Hero)
  • కుశాలిని (Heroine)
  • అన్వేష్ మైఖేల్, ప్రవీణ్ దాచారం, దయానంద్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు.. (Cast)
  • శ్రీమాన్ కీర్తి (Director)
  • దాము రెడ్డి - శింగనమల కళ్యాణ్ (Producer)
  • రాజీవ్ - శ్రీకాంత్ (Music)
  • రుషి కోనాపురం (Cinematography)

ఈవారం విడుదలవుతున్న చిన్న సినిమాల్లో టైటిల్ తో ప్రాముఖ్యత సంతరించుకున్న సినిమా “రాక్షస కావ్యం”. ఇండిపెండెంట్ సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని, థియేట్రికల్ రిలీజ్ చేశారు నిర్మాతలు. దైవత్వం కోసం పుట్టుకొచ్చిన రాక్షసత్వం అనే కాన్సెప్ట్ తో శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: అజయ్ (అభయ్ బేతగంటి), విజయ్ (అన్వేష్ మైఖేల్) ఇద్దరూ అన్నాతమ్ముళ్ళు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తాగుబోతు తండ్రి కారణంగా దొంగలుగా పెరుగుతారు. చెడులో మంచిని చూడగలగడం అజయ్ వ్యక్తిత్వమైతే.. మంచి మీద చెడు గెలవాలి అనుకోవడం విజయ్ క్యారెక్టర్. మంచి చేయడం కోసం చెడుగా మారిన అజయ్ వెర్సెస్ చెడును శాసించడం కోసం విపరీత బుద్ధిగా మారిన విజయ్ ల సంఘర్షణల సమాహారమే “రాక్షస కావ్యం”.

నటీనటుల పనితీరు: “కొత్త పోరడు” ఫేమ్ అన్వేష్ మైఖేల్ తన స్క్రీన్ ప్రెజన్స్ తో అందర్నీ డామినేట్ చేసేశాడు. ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ మొత్తం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు అన్వేష్. ఎదగడానికి మంచి స్కోప్ ఉన్న నటుడు అన్వేష్ మైఖేల్, కాకపోతే కాస్త మంచి కథలు ఎంచుకోవాలి. అభయ్ బేతగంటి హీరోగా నిలదొక్కుకోవడం కోసం చేసిన ఈ రెండో ప్రయత్నం (మొదటి ప్రయత్నం “రామయ్య యూత్”, అది కూడా స్వీయ దర్శకత్వంలో) కూడా బెడిసికొట్టిందనే చెప్పాలి. దొంగతనాలు చేసుకొనే కుర్రాడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ..

మర్డర్లు చేసే గల్లీ నాయకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ రౌడీయిజం తాలూకు పెద్దరికం అభయ్ బాడీ లాంగ్వేజ్ లో కానీ హావభావాలలో కానీ కనిపించలేదు. అతడు హీరోగా కంటే నటుడిగా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది. సీనియర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ దయానంద్ రెడ్డి మరోమారు నెగిటివ్ రోల్లో జీవించేశాడు. అతడి నట ప్రతిభను కనబరుచుకొనే అవకాశాన్ని ఏ ఒక్క సన్నివేశంలోనూ వదులుకోలేదు దయానంద్.

వీళ్ళందరి తర్వాత తన హావభావాలతో ఆకట్టుకున్న నటుడు పవన్ రమేష్. చైతన్య అనే స్టూడెంట్ పాత్రలో రమేష్ ఎక్స్ ప్రెషన్స్ & డైలాగ్ డెలివరీ మంచి ఫన్ డెలివరీ చేశాయి. నిజానికి సినిమా కాస్త ముందుకు వెళ్లింది అంటే కారణం పవన్ రమేష్ అనే చెప్పాలి. యాదమ్మ రాజు, వినయ్ కుమార్, కోట సందీప్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ రిషి కోనాపురం గురించి ముందుగా మాట్లాడుకోవాలి. ఆడియన్స్ కు టెక్నికల్ గా ఒక క్వాలిటీ ఫిలిమ్ అందించడంలో రిషి సక్సెస్ అయ్యాడు. కొన్ని ఫ్రేమింగ్స్ & లైటింగ్స్ కొత్తగా కనిపించాయి. బ్రైట్ లైట్ కాకుండా ఎల్లో లైట్ తో చెడు-మంచి మధ్య తేడాను అంతర్లీనంగా చూపించిన విధానం బాగుంది. అలాగే.. చెడులో మంచి, మంచిలో చెడు అనే కాన్సెప్ట్ ను తెరపై చూపడంలో సక్సెస్ అయ్యాడు రిషి. రాజీవ్-శ్రీకాంత్ ల బాణీలు, నేపధ్య సంగీతం ఆకట్టుకొనే స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ పర్వాలేదు అనిపించాయి.

ఇక దర్శకుడు శ్రీమాన్ కీర్తి విషయానికి వస్తే.. మూలకథగా మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్న అతడు, స్క్రీన్ ప్లే విషయంలోనూ కాస్త జాగ్రత్తపడ్డాడు. కానీ.. ఆ కథను నడిపించే సన్నివేశాల కంపోజిషన్ లో మాత్రం బొక్కబోర్లాపడ్డాడు. అజయ్ పాత్ర ఓ మేరకు పర్వాలేదు అనిపించినా.. విజయ్ పాత్రను తీర్చిదిద్దిన తీరు మాత్రం దారుణంగా బెడిసికొట్టింది. అన్వేష్ మైఖేల్ తన నటనతో పాత్రకి ఎంత సపోర్ట్ ఇచ్చినా.. పనికిమాలిన లాజిక్ కారణంగా ఆ పాత్ర వర్కవుటవ్వలేదు. ఎంత మూర్ఖత్వపు పాత్ర అయినప్పటికీ.. పాత్ర తాలూకు ఎమోషన్ కు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేనప్పుడు, హీరో అయినా విలన్ అయిన ఫెయిలైనట్లే.

కాకపోతే.. మదర్ సెంటిమెంట్ సీన్స్ & జనాలపై సినిమా ప్రభావం ఎలా ఉంటుంది వంటి విషయాలను తెరకెక్కించిన విధానం బాగుంది. ముఖ్యంగా.. అన్నీ సినిమాల్లో పవన్, మహేష్ బాబుల ఇన్ఫ్లూయెన్స్ చూసి చూసి బోర్ కొట్టి, ఈ సినిమాలో నాగార్జున శివ సినిమా చూపించడంతో ఒక రిలీఫ్ కలిగిన భావన. దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న శ్రీమాన్ కీర్తి, కథకుడిగా మాత్రం ఆకట్టుకోలేక చతికిలపడ్డాడు.

విశ్లేషణ: ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ (Raakshasa Kaavyam) సినిమా, మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్.. కేవలం సరైన కథనం & క్యారెక్టరైజేషన్స్ లేక ప్రేక్షకుళ్ను అలరించలేకపోయింది. అన్వేష్ మైఖేల్ లాంటి నటుడికి మాత్రం వెండితెరపై తన ప్రతిభను కనబరుచుకొనే అవకాశం కలిపించి.. ఇండస్ట్రీకి మరో మంచి ఆర్టిస్ట్ ను పరిచయం చేసింది.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus