Radhe Shyam: బాలీవుడ్ మీడియా అసలు రంగు చూపిస్తోందా?
March 13, 2022 / 11:11 PM IST
|Follow Us
సౌత్ సినిమా అందులోనూ తెలుగు సినిమాకు బాలీవుడ్ ఇటీవల కాలంలో బ్రహ్మరథం పడుతోంది. ‘బాహుబలి’తో మొదలైన ఈ జోరు ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలతో కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన కథలు చాలా బాలీవుడ్‌కి రీమేక్‌లుగా వెళ్తున్నాయి. మన దర్శకులు, నటులు అక్కడికెళ్లి తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇదంతా బాలీవుడ్ జనాలకు ఎలా ఉందో తెలియదు కానీ, బాలీవుడ్ మీడియాకు మాత్రం పెద్దగా నచ్చినట్లు అనిపించడం లేదు. కొత్తవి కాని అంశాలను పట్టుకొని, అదేదో పెద్ద తప్పు అనేలా చిత్రిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘రాధేశ్యామ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్స్డ్ టాక్‌తో సినిమా ముందుకుపోతోంది. సినిమా ఆలోచన బాగుంది, ప్రధాన నటుల నటన బాగుంది, సాంకేతిక నిపుణుల పనితీరు బాగుంది అని అంటున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా మాత్రం ఆశించిన మేర ఫలితం రాబట్టడంతో విఫలమైంది అంటున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి అని చెబుతున్నారు. అయితే బాలీవుడ్ మీడియాకు వేరే కారణాలు కనిపిస్తున్నాయి.
ఎంత ఖర్చుతో తీస్తే ఏం లాభం ? సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ లేదని, అసలు ఈ మాత్రం కథ చెప్పడానికి ప్రభాస్ లాంటి స్టార్, అంత సెటప్ ఎందుకని విశ్లేషణలు ఇచ్చారు. ‘రాధేశ్యామ్’ విడుదలయ్యాక బాలీవుడ్ మీడియా ఏం రాసిందో చూస్తే… వాళ్ల హీరోల విషయంలో ఇలా ఎందుకు మాట్లాడరు అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. ‘రాధేశ్యామ్’ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్స్… ప్రభాస్ ఏజ్ గురించి, లుక్ గురించి చెబుతున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటించడం విషయంలోనూ వాళ్లకు అభ్యంతరాలు ఉన్నాయి. 42 ఏళ్ల ప్రభాస్‌కు 52 ఏళ్ల భాగ్యశ్రీ తల్లిగా నటించడం ఏంటి అని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ అడుగుతున్నారు. బాలీవుడ్ హీరో, హీరోయిన్ ఏజ్ గ్యాప్… అలాగే హీరో – తల్లి పాత్ర వేసిన వారి ఏజ్ గ్యాప్ లెక్కలు తీస్తే వారానికొకటి కనిపిస్తాయి. అలాంటిది తెలుగు సినిమా అక్కడికి పాన్ ఇండియా సినిమాగా వెళ్లేసరికి ఏజ్ గ్యాప్ పెద్ద అంశం అయిపోయిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.