నా జీవితంలో మరీపోలేని రోజు ఇది : కె.రాఘవేంద్ర రావు
April 29, 2020 / 07:28 PM IST
|Follow Us
ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ కు చాలా స్పెషల్ ఉందండోయ్. మన టాలీవుడ్ అందగాళ్ళు మహేష్ బాబు ‘పోకిరి’ అలాగే ప్రభాస్ ‘బాహుబలి2’ చిత్రాలు ఏప్రిల్ 28న విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అయితే మనకి తెలియని మరో చిత్రం కూడా ఏప్రిల్ 28 నే విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ చిత్రం మరేదో కాదు.. కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ చిత్రం కూడా ఏప్రిల్ 28 నే విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ కె.రాఘవేంద్ర రావు గారు ఓ లేఖ ను పోస్ట్ చేసారు.
‘బాహుబలి 2’ కూడా ఆయన సమర్పణలో వచ్చిన చిత్రమే కావడం విశేషం. ఇక తన లేఖ ద్వారా కె.రాఘవేంధ్రరావు గారు స్పందిస్తూ..”ఏప్రిల్ 28 నా జీవితంలో.. ఓ మరపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం మరో మెట్టు ఎక్కినరోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర సృష్టించిన రోజు. ఆ నందమూరి ‘అడవి రాముడి’ని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, పంపిణీ దారులకు, ఎగ్జిబిటర్లకు ఆ చిత్ర దర్శకుడిగా.. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అడవి రాముడు’ 4 సెంటర్లలో ఒక సంవత్సరంపాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్ థియేటర్లో ప్రతిరోజు 5 షోలతో 100 రోజులు ఆడటం మరో విశేషం. అలా ఈ చిత్రం రికార్డుల రాముడిగా మారింది. బంగారానికి తావి అబ్బినట్లు ఏప్రిల్ 28 నాడే నా సమర్పణలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ‘అడవి రాముడు’ ఆహా అనిపిస్తే.. ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండగలని ఒకేరోజు అందించిన ఏప్రిల్ 28.. కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ.. అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీసు విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు చెబుతున్నా’ అంటూ తెలిపారు.