కథలో ఒక పాత్ర బలంగా ఉంటుంది. అతని చుట్టూ కథ నడుస్తుంది. ఆ పవర్ ఫుల్ క్యారక్టర్ హీరో అవుతాడు. సాధారణంగా అన్ని సినిమా కథలు ఇలానే ఉంటాయి. కానీ రాజమౌళి సినిమాలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో హీరోతో పాటు సహాయ పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే అతని సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి. రాజమౌళి చెక్కిన పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పై ఫోకస్…
బిక్షుయాదవ్ (సై)ముక్కుకి పెద్ద రింగ్, మెలితిరిగిన గుబురు మీసాలు, నోట్లో పొడుగాటి చుట్ట.. సై సినిమాలో భిక్షుయాదవ్ ని చూడగానే భయం వేస్తుంది. ప్రదీప్ రావత్ పోషించిన ఈ పాత్ర లుక్ లోనే కాదు.. యాక్షన్ కూడా భయపెట్టిస్తుంది. అంత పవర్ ఫుల్ గా రాజమౌళి ఈ క్యారెక్టర్ ని చూపించారు. గుర్తిండిపోయేలా చేశారు.
కాట్రాజు (ఛత్రపతి) ఛత్రపతి సినిమాలో కాట్రాజుది చిన్న పాత్రే. అయినప్పటికీ ఆ సినిమాతో ఆ పేరు మారుమోగింది. కారణం అతని ఆకారం మాత్రమే కాదు.. చేసే పనులు. చాలా కర్కశంగా ఉంటాడు. పిల్లలు అని చూడకుండా దారుణంగా కొడతాడు. అతని వల్లే బానిసగా బతుకుతున్న ఛత్రపతి లోని హీరో బయటికి వస్తాడు. అతన్ని చంపడంతో కథ మలుపుతిరుగుతుంది. ఆ పాత్రతో సుప్రీత్ అసలు పేరు కాట్రాజు గా మారిపోయింది.
యమధర్మ రాజా (యమదొంగ) తెలుగు సినిమాల్లో పూర్వం యముడు అనగానే కొంత అవివేకంగా, ఆలోచనలేని వ్యక్తిగా చూపిస్తుంటారు. రాజమౌళి మాత్రం యమదొంగ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఆ పాత్రలో మోహన్ బాబు మరింత చక్కగా నటించి మదిలో నిలిచిపోయారు.
షేర్ ఖాన్ (మగధీర) మగధీర సినిమా పేరు చెప్పగానే భైరవ తర్వాత గుర్తుకు వచ్చే పేరు షేర్ ఖాన్. ఈ పాత్ర సినిమాలో కనిపించేది కొన్ని నిముషాలే.. అయినా విలువలున్న పోరాట యోధుడిగా షేర్ ఖాన్ పేరు పొందారు. ఆ పాత్రను అందరూ ప్రేమించేలా జక్కన్న చెక్కారు.
నాగినీడు (మర్యాదరామన్న) నాగినీడు మర్యాదరామన్నలో నెగిటివ్ షేడ్స్ గల పాత్ర. అయినా అతన్ని అందరూ పక్కింటి వ్యక్తిలా భావించారు.నాగినీడు మనుషుల్ని చంపుతాడు.. కానీ అందుకు బలమైన కారణం ఉంటుంది. ఎంతటి బలమైన కారణమైనా తన ఇంట్లో చంపడు. ఇలా కొన్ని నియమాలకు కట్టుబడిన వ్యక్తిగా నాగినీడు గుర్తింపు దక్కించుకున్నారు. నాగినీడు క్యారక్టర్ కి రామినీడు జీవం పోశారు.
సుదీప్ (ఈగ)సినిమాలో హీరోకి సమానంగా విలన్ ఉంటాడు. కానీ ఈగ సినిమాలో హీరో కంటే అత్యంత బలవంతుడిగా విలన్ రోల్ ఉంటుంది. ఈగని చంపేందుకు ఆ క్యారక్టర్ పడే తిప్పలు ఆసక్తిని కలిగిస్తాయి. ఆ పవర్ ఫుల్ రోల్ ల్లో సుదీప్ మరింత రెచ్చిపోయారు. ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.
శివగామి (బాహుబలి) తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా బాహుబలి లో హీరో (బాహుబలి), విలన్ (భల్లాల దేవా) పాత్రలు మాత్రమే కాదు అనేక పాత్రలను పవర్ ఫుల్ గా రాజమౌళి మలిచిన తీరు అద్భుతం. మహిష్మతి రాజమాత శివగామి పాత్రకు మహామహులు సెల్యూట్ చేశారు. రాజ్యాన్ని మాటతో శాశించే రాణిగా అదరగొట్టింది. ఈ క్యారక్టర్ కి రమ్యకృష్ణకి మరింత పవర్ తెచ్చింది.
కట్టప్ప (బాహుబలి) బాహుబలి సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ కట్టప్ప. మహిష్మతి రాజ్యానికి కట్టు బానిసను కూడా శక్తిమంతుడిగా చూపించవచ్చని రాజమౌళి నిరూపించారు. అంతేకాదు బాహుబలి కంక్లూజన్ సినిమాపై కట్టప్ప పాత్ర ద్వారానే డైరక్టర్ అంచనాలను పెంచారు. ఈ పాత్రలో నటించిన సత్యరాజ్ కి అభిమానులు కట్టప్పగా నామకరణం చేశారు.
టిట్లా (విక్రమార్కుడు ) చంబల్ లోయలో నివసించే దోపిడీదారులు ఎలాఉంటారో విక్రమార్కుడు సినిమాలో టిట్లా పాత్ర ద్వారా రాజమౌళి మనకి చూపించారు. ఈ పాత్ర కనిపించినప్పుడల్లా గుండె జలదరిస్తుంది. అంతలా టిట్లా క్యారెక్టర్ డిజైన్ చేశారు. అందులో అజయ్ జీవించారు.