చేసినవి రెండే సినిమాలు అయినా.. వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు పవన్ సాదినేని. ఇప్పుడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ‘శేఖర్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజశేఖర్ సరైన విజయం అందుకోలేకపోయారు. దీంతో పవన్ సాదినేని సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు.
ముందుగా చెప్పినట్లు పవన్ సాదినేని సినిమాలు నార్మల్‌గా ఉండవు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపించాలని అనుకుంటూ ఉంటారు. తొలి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో ఈ ప్రయత్నం చేసి మంచి కిక్ స్టార్ట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘సావిత్రి’ మిస్ ఫైర్ అయ్యింది. ఆ తర్వాత పవన్ నుండి సినిమాలు రాలేదు. కానీ వెబ్ సిరీస్‌లు మాత్రం చేస్తూ వచ్చారు. ‘సేనాపతి’ పేరుతో ఓటీటీ కోసం ఓ సినిమా తీశారు. దానికి మంచి పేరు వచ్చింది.
ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు మెగా స్క్రీన్ కోసం మెగా ఫోన్ పడుతున్నారట. ఇటీవల రాజశేఖర్‌కి కథ వినిపించగా.. ఆయన వెంటనే ఓకే అన్నారు అని సమాచారం. ‘సావిత్రి’ తర్వాత పవన్.. వరుసగా ‘పిల్లా’, ‘ఈ ఆఫీసులో’, ‘కమిట్ మెంటల్’ లాంటి భిన్నమైన వెబ్ సిరీస్‌లు చేసి వావ్ అనిపించారు. ఇక రాజశేఖర్ ‘గరుడవేగ’తో తిరిగి స్వింగ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగించలేదు.
మరిప్పుడు పవన్ సాదినేని సినిమాతో సరైన విజయం అందుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక పవన్ సాదినేని తన తర్వాతి సినిమాను శ్రీవిష్ణుతో చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు రాజశేఖర్ సినిమా ఓకే అయ్యింది. మరి ఈ రెండింటిలో ఏ సినిమా ముందు ప్రారంభిస్తారు అనేది చూడాలి. రాజశేఖర్ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. కాబట్టి ముందు ఈ సినిమానే ప్రారంభమవుతుందని సమాచారం. లేకపోతే రెండు సినిమాలను ఒకేసారి చేస్తారేమో చూడాలి.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?