రజనీకాంత్ రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు ఇదేనంటూ జోరుగా ప్రచారం!
May 16, 2017 / 08:11 AM IST
|Follow Us
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రానున్నారు. 1996 ఎన్నికల సమయంలో డీఎంకేకు మద్దతు తెలిపిన ఆయన ఆ తర్వాత ఎవరి పక్షాన నిలవలేదు. గత ఇరవై ఏళ్లుగా అతన్ని రాజకీయాల్లోకి పిలుస్తున్నా.. వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఇప్పుడు తమిళనాట ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా రజనీ నేతగా అవతారం ఎత్తనున్నారు. ఈ విషయంపై అభిమానులతో చర్చించడానికి నిన్నటి నుంచి సమావేశం ప్రారంభించారు. ఈ మీటింగ్ ఐదు రోజులపాటు సాగనుంది. అనంతరం పార్టీ చిహ్నం, విధి విధానాలు ప్రకటించనున్నారు. అయితే తొలి రోజే పార్టీ చిహ్నం ఇదేనంటూ రజనీ అభిమానులు సందడి చేస్తున్నారు.
సోమవారం రజనీ వేదికపై కూర్చొనుండగా అతను బాబా సినిమాలో చూపించే సింబల్ కింద తామర పుష్పం ఉన్న గుర్తు ఒకటి వెనుక తెరపై ప్రసారం అయింది. ఆ గుర్తునే రజనీ పార్టీ గుర్తుగా తమిళీయులు విశ్వసిస్తున్నారు. తాను అవినీతి రహిత పాలన సాగిస్తానని రజనీ స్పష్టం చేయడంతో అందుకు చిహ్నమే తెల్ల కలువ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిహ్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతున్నా.. దీనిపై రజనీ ఔననీ, కాదని గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.