సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య వివాహం ఫిబ్రవరి 11 సోమవారం(నిన్న) నాడు ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ వనగమూడితో ఆమె పరిచయం పెళ్ళికి వరకూ దారి తీసింది. వీరి వివాహం చెన్నైలోని ఎంఆర్సీ నగర్లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
సోమవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఇక ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్, కమల్ హాసన్, మోహన్ బాబు, సుబ్బిరామి రెడ్డి, అనిరుద్, రాఘవ లారెన్స్, మణిరత్నం, ఆండ్రియా, సుహాసిని తదితరులు హాజరయ్యారు. రజినీకాంత్ పెద్ద అల్లుడయిన ధనుష్ వీరికి ఘన స్వాగతం పలికాడు. ఇక ఈ పెళ్ళి వేడుకలో తీసిన కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సౌందర్య.. ‘శ్రీమతి, శ్రీవారు.. నా కుటుంబం. మనం ఒక్కటయ్యాం’ అని పేర్కొంటూ… వేద్ విశాకన్ సౌందర్య’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫోటోలను షేర్ చేసింది. ఇక తాళి కట్టే సమయంలో సౌందర్య భావోద్వేగానికి లోనవగా రజనీ ఆమెను అనునయించి, ధైర్యం చెప్పినట్టు ఈ ఫొటోలో స్పష్టం అవుతుంది. మూడు రోజుల పాటు సాగిన వీరి పెళ్ళి వేడుకలో సంగీత్, మెహెందీ అంటూ చాలా వేడుకలను నిర్వహించారు. ఇక ఈరోజు సాయంత్రం చెన్నైలో వీరి వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.