Ram Charan: ఏపీ నుంచి ఒక టీమ్ ఐపీఎల్ లో పాల్గొనాలని రామ్ చరణ్ సన్నాహాలు!
April 19, 2023 / 05:36 PM IST
|Follow Us
క్రికెట్, సినిమా ఈ రెండూ భారతదేశానికి రెండు కళ్ళు లాంటివి. సినిమాని ఎంతగా ప్రేమిస్తారో.. క్రికెట్ ని కూడా అంతే ఎక్కువగా ప్రేమిస్తారు. క్రికెట్ ఆడేవారు సినిమా వాళ్ళకి, సినిమాల్లో నటించే వారు క్రికెట్ ఆడేవారికి అభిమానులుగా ఉండడం సహజమే. సినిమా హీరోలు క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలో అడుగుపెడితే ఆ కిక్కే వేరు. సెలబ్రిటీ లీగ్ పేరుతో ఆయా ఇండస్ట్రీల మధ్య మ్యాచులు కూడా నిర్వహిస్తారు. సినిమా వాళ్లకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదొక్కటి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి కూడా క్రికెట్ అంటే ఇష్టమే. అలాంటి చరణ్ ఐపీఎల్ లో అడుగుపెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రామ్ చరణ్ ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నారు. అయితే క్రికెటర్ గా కాదు. టీమ్ ఫ్రాంచైజీగా. అవును ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక్క టీమ్ కూడా లేదు. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ లా.. ఏపీ నుంచి కూడా ఒక టీమ్ ఐపీఎల్ లో పాల్గొనాలని రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యానని.. వచ్చే ఏడాది రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త టీమ్ ఐపీఎల్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఈ టీమ్ కి వైజాగ్ వారియర్స్ పేరు పెట్టినట్లు సమాచారం. నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. పోలో టీమ్, ట్రూ జెట్ విమానయాన సంస్థల అధినేతగా, సినీ నిర్మాతగా సత్తా చాటిన చరణ్ ఇప్పుడు ఐపీఎల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు పలు టీమ్ లకు ఫ్రాంచైజీ యజమానులుగా ఉన్నారు. ఐపీఎల్ బిజినెస్ అంటే వందల కోట్లలో ఆదాయం ఉంటుంది. ఐపీఎల్ ను మించిన బిజినెస్ మరొకటి లేదు. అందుకే రామ్ చరణ్ ఐపీఎల్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతా బాగుంటే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఐపీఎల్ లో ఆడనుంది. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం కావాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.