‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు… లుక్‌లోను, ఆలోచనలోనూ. ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి అభిమానుల్ని దూరం చేయకుండా అలాంటి రగ్డ్ లుక్‌లో ‘రెడ్’ సినిమాను ప్రకటించాడు. అదే జోరులో సినిమాను పూర్తి చేసి విడుదల చేసి, హిట్ కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ కరోనా – లాక్డౌన్ వచ్చి లెక్కల్ని మార్చేసింది. దీంతో ఆగి, ఆగి.. ఓటీటీ ఆఫర్లను పక్కనపెట్టి డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాడు. త్వరలో సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఇతర సంక్రాంతి సినిమాల కంటే తమ సినిమా ఎలా స్పెషలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ ప్రకటన ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. అసలు ఇది జరుగుతుందా అనే ఆలోచన కూడా కలిగిస్తోంది.
తమిళంలో విజయం సాధించిన ‘తడమ్’ సినిమాను తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం అంటూ చిత్రబృందం ప్రకటించింది. దీంతో ‘మా రామ్ సినిమా ఏడు భాషల్లో అట’ అని అభిమానులు అనుకుంటూ ఆనందపడుతుండగా, ‘అంత సీన్ లేదు…’ అని ఇతర హీరోల అభిమానులు చర్చించుకుంటున్నారు. దానికీ కారణం ఉంది. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చాలా సినిమాల విషయంలో వచ్చాయి. తీరా సినిమా విడుదలయ్యాక ఆ ఊసే లేకుండా పోయింది. చేసిన ఏ ఆరేడు నెలల తర్వాత, ఇక్కడ సినిమా ఊసులు పోయాక విడుదల చేస్తుంటారు.
కన్నడ, మలయాళ,బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, హిందీతో పాటు తమిళంలో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తారట. ఇందులో కన్నడ వెర్షన్‌ను తెలుగుతోపాటే విడుదల చేస్తారట. మిగిలినవి నెలాఖరుకు వస్తాయట. ఇన్ని భాషల్లో రిలీజ్ చేసేంత ఫేమ్, స్టామినా రామ్‌కు ఉందా అంటే… అతని సినిమాల వసూళ్లే సమాధానం చెబుతాయి.. మనమెందుకు అనుకోవడం. అసలు ఇప్పటివరకు ఆయా భాషల్లోకి వెళ్లిన రామ్ సినిమాలు లేవు. మరోవైపు తమిళం నుంచి తీసుకొచ్చిన సినిమాలు డబ్బింగ్ చేసి అక్కడికే పంపడం ఏంటో, అప్పుడెప్పుడో తమిళం నుంచి అలా మనకు వచ్చేవి. అక్కడి సినిమా మనం రీమేక్ చేశాక, ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ కూడా వచ్చేది. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో మేం తోపు అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి డబ్బింగ్ వెర్షన్లు వస్తాయా అంటే ఏమో మరి.