నేను అలాంటి సినిమాలు చేయను, చేయలేను అంటున్న రానా దగ్గుబాటి
August 10, 2017 / 10:31 AM IST
|Follow Us
పరిచయం అవసరం లేని పేరు “రానా”. రామానాయుడుగారి మనవడిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఆరున్నరడుగుల అందగాడు.. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మరియు దగ్గుబాటి కుటుంబానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయాడు. తెలుగుతోపాటు తమిళ-హిందీ భాషల్లో నెగిటివ్-పాజిటివ్ అన్న బేధాన్ని పట్టించుకోకుండా తన నాటచాతుర్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటూ ఇంతింటై వటుడింతై అన్న చందాన ఎదుగుతున్నాడు రాణా. రేపు విడుదలవుతున్న “నేనే రాజు నేనే మంత్రి” గురించి రాణా చెప్పిన విశేషాలు..!!
నాకు ఆ భయం లేదు..
నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడను. కథ నమ్మి సినిమాలు చేసే హీరోను నేను, అందుకే వేరే సినిమాల సేమ్ డేట్ రిలీజ్ అవుతున్నా నాకు భయం లేదు, ముఖ్యంగా మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్స్, సో ఈ వీకండ్ ఒక సినిమా ఫెస్టివల్ లాంటిది అనే ఆలోచనే ఉంది తప్ప పోటీ అని నేనెప్పుడూ అనుకోవడం లేదు.
తేజగారి కెరీర్ గ్రాఫ్ నాకవసరం లేదు..
“బాహుబలి, ఘాజీ” లాంటి భారీ హిట్స్ తర్వాత తేజగారితో సినిమా ఎందుకు చేస్తున్నావ్, ఆయనకసలే హిట్స్ లేవు అని చాలా మంది భయపెట్టడానికి ప్రయత్నించారు. కానీ.. తేజగారి కెరీర్ గ్రాఫ్ తో నాకు పనిలేదు, నాకు తెలిసి ఆయన ఒక గొప్ప టెక్నీషియన్. ఆయన రాసుకొన్న కథను నేను నమ్మాను. అందుకే “నేనే రాజు నేనే మంత్రి” సినిమా చేసానే కానీ.. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని కాదు.
కునాల్ అని ఒకడుంటాడు..
“బాహుబలి” తర్వాత షూట్ స్టార్ట్ చేసిన సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. ఈ సినిమా కోసం రెండు వేరియేషన్స్ కనిపించాలి. అందుకే ముందు బరువు తగ్గాను, తర్వాత క్యారెక్టర్ గ్రోత్ కోసం మళ్ళీ బరువు పెరిగాను. నా పర్సనల్ ట్రైనర్ కునాల్ వల్లే ఇది సాధ్యమైంది. జోగేంద్ర పయనంలో ఈ బాడీ వేరియేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
రాధగా కాజల్ మాత్రమే సూట్ అవుతుంది..
తేజగారితో మొదటి సినిమా చేసిన కాజల్ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో 50వ సినిమా చేస్తుంది. పైగా.. నా హైట్ కి, క్యారెక్టర్ కి ఉన్న వెయిట్ కి కాజల్ తప్పితే ఎవరూ సూట్ అవ్వరు అనిపించింది. ఇంకా చెప్పాలంటే.. జోగేంద్ర కంటే పవర్ ఫుల్ క్యారెక్టర్ రాధమ్మది.
మా నాన్న జోక్ చేశారు..
మార్కెటింగ్ విషయంలో నేను మా నాన్నని మించిపోయానని మొన్నీమధ్య నాన్నగారు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారని విన్నాను. అందులో ఏమాత్రం నిజం లేదు. నేను ఒక నటుడ్ని మాత్రమే, కాకపోతే నా సినిమాని ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాలని ఆరాటపడతాను. అందుకే కుదిరినంతలో పబ్లిసిటీ చేసుకొంటాను. అంతే తప్ప మా నాన్నగారితో పోల్చి చూస్తే మార్కెటింగ్ విషయంలో నేనింకా విద్యార్ధినే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.