Ranga Ranga Vaibabavanga Review: రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!
September 2, 2022 / 05:39 PM IST
|Follow Us
“ఉప్పెన, కొండ పొలం” చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం “రంగ రంగ వైభవంగా”. “అర్జున్ రెడ్డి” తమిళ వెర్షన్ “ఆదిత్య వర్మ”తో మంచి సక్సెస్ సాధించిన గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ).. ఇద్దరు చిన్నప్పటినుండి కలిసి పెరుగుతారు. ఇద్దరి కుటుంబాలు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ.. వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పటికప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అలా గొడవపడిన ప్రతిసారి ఇద్దరూ ఇంకాస్త దగ్గరవుతుంటారు.
ఇద్దరి ప్రేమ ప్రయాణం ఇంకాస్త దగ్గరవుతున్న తరుణంలో.. రాధ అన్నయ్య అర్జున్ (నవీన్ చంద్ర) కారణంగా ఇరు కుటుంబాల నడుమ అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. ఆ కారణంగా కుటుంబాలే కాక రిషి-రాధలు కూడా దూరమవ్వాల్సి వస్తుంది. ఇంతకీ అర్జున్ తీసుకొచ్చిన సమస్య ఏమిటి? రిషి-రాధ దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అనేది “రంగ రంగ వైభవంగా” కథాంశం.
నటీనటుల పనితీరు: వైష్ణవ్ తేజ్ హీరోగా మూడో సినిమాతో నటుడిగా ఇంకాస్త డెవలప్ అయ్యాడు. మొదటి సినిమాతో సగటు యువకుడిగా, రెండో సినిమాతో బాధ్యతగల కొడుకుగా ఆకట్టుకున్న వైష్ణవ్.. మూడో సినిమాతో ఎనర్జిటిక్ రోల్లో అలరించాడు. మధ్యమధ్యలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ మెగా అభిమానులను అలరించాడు. కేతిక శర్మ అటు నటిగా అలరించలేక, ఇటు అందంతో ఆకట్టుకోలేక నానా ఇబ్బందులుపడింది. నిజానికి ఈ పాత్రకి చక్కని హావభావాలతో ఆకట్టుకొనే నటిని ఎంపిక చేసి ఉంటే..
కనీసం చూడ్డానికి బాగుండేది. అసలే కేతిక ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా కనిపించవు, దానికి తోడు అమ్మాయికి ఇచ్చిన ఈగో క్యారెక్టర్ కి అసలు ముఖ్యంలో ఎలాంటి భావాలు కనిపించకుండా మ్యానేజ్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది ఆమెకు. ఇక లెక్కకుమిక్కిలి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. ఎవరి పాత్రకూ పెద్దగా ప్రాముఖ్యత లేదు. అందువల్ల ఎవరి పాత్రతోనూ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు గిరీశయ్య చాలా సాధారణ కథను, కొత్తగా చెప్పి అలరిద్దామని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి. నిజానికి ఈ తరహా కథను ఇప్పటికీ చాలాసార్లు చూసేశాం. “నువ్వు లేక నేను లేను, నిన్నే పెళ్లాడతా” లాంటి చిత్రాలు ఈ తరహా కథతోనే విజయాన్ని అందుకున్నాయి. అయితే.. ఆ చిత్రాల్లో మంచి ఎమోషన్ ఉంది.
ఆ ఎమోషన్ కానీ, కనెక్టివిటీ కానీ “రంగ రంగ వైభవంగా”లో లేకపోవడం గమనార్హం. కామెడీ సన్నివేశాల నుంచి.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ వరకూ ఎక్కడా కొత్తదనం లేదు. సో, కథకుడిగా, దర్శకుడిగా గిరీశయ్య ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చాన్నాళ్ల తర్వాత నేపధ్య సంగీతంతో అలరించాడు.
లవ్ & ఎమోషనల్ సీన్స్ లో దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం చాలా కొత్తగా వినబడింది. షాందత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ కూడా పర్వాలేదు. నిజానికి సినిమాకి కావాల్సినడానికంటే కాస్త ఎక్కువే ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే.. ఆ ఖర్చును సరిగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు.
విశ్లేషణ: మెగా హీరో మూడో సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వైష్ణవ్ తేజ్ నటన, దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ కోసం సినిమాను ఒకసారి ఓపిగ్గా చూడొచ్చు.