Rangamarthanda Review in Telugu: రంగమార్తాండ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 31, 2023 / 04:48 PM IST

Cast & Crew

  • ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, (Hero)
  • రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, (Heroine)
  • ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.. (Cast)
  • కృష్ణవంశీ (Director)
  • కాలిపు మధు - ఎస్.వెంకట్ రెడ్డి (Producer)
  • ఇళయరాజా (Music)
  • రాజ్ నల్లి (Cinematography)

గత పుష్కరకాలంగా సరైన విజయం లేక తన ఉనికిని చాటుకోవడం కోసం పరిపరి విధాల పరితపిస్తున్న కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం “రంగమార్తాండ”. 2016లో మరాఠీ భాషలో విడుదలైన “నటసామ్రాట్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: నాటక రంగంలో పేరుగాంచిన రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్), నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి, తాను సంపాదించిన ఆస్తిపాస్తులను తన కొడుకు (ఆదర్శ్ బాలకృష్ణ), కోడలు (అనసూయ భరద్వాజ్), కూతురు (శివాత్మిక రాజశేఖర్)లకు సమానంగా పంచి పెట్టి.. భార్య (రమ్యకృష్ణ)తో సంతోషంగా శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటాడు.

కానీ.. రాఘవరావు వ్యక్తిత్వం, అలవాట్ల కారణంగా అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? కన్నబిడ్డల వల్ల రాఘవరావు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “రంగమార్తాండ” కథాంశం.

నటీనటుల పనితీరు: టైటిల్ పాత్రధారి ప్రకాష్ రాజ్ కంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది బ్రహ్మానందం గురించి. బ్రహ్మానందం గొప్ప నటులు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఒక తరానికి ఆయన కేవలం ఒక కమెడియన్ గా మాత్రమే తెలుసు. ప్రేక్షకులు అలానే చూస్తున్నారు కదా అని దర్శకులెవరూ ఆయన్ను మరో కోణంలో చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే.. కృష్ణవంశీ మాత్రం.. బ్రహ్మానందంలోని నటుడిలోని చాలా తక్కువమందికి మాత్రమే తెలిసిన కోణాన్ని వెలికితీశారు. ప్రకాష్ రాజ్ ఇంటికొచ్చినప్పుడు, ఆసుపత్రిలో బ్రహ్మానందం నటన చూసి విస్తుబోని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో అలరించిన నటి రమ్యకృష్ణ. ఒక సగటు గృహిణిగా కంట్రోల్డ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో నేర్పుతో ఈ చిత్రంలో ఒదిగిపోయిన తీరు ప్రశంసనీయం.

ప్రకాష్ రాజ్ కు ఈ తరహా పాత్ర కొత్త కాదు, ఆయన ఆస్థాయిలో హావభావాలు పండించిన తీరు చూడడం ప్రేక్షకులకు కూడా కొత్త కాదు. అందువల్ల ప్రకాష్ రాజ్ పాత్ర కానీ, ఆయన నటన కానీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.

శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ లు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు: ఇళయరాజా పాటలు, నేపధ్య సంగీతం “రంగమార్తాండ”కు ఆయువుపట్టుగా నిలిచాయి. రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం సినిమాకి మైనస్ గా మారింది. సినిమాను కూడా నాటకంలా ప్రెజంట్ చేయడం కోసం ఆయన తీసుకొన్న జాగ్రత్తలు బెడిసికొట్టాయనే చెప్పాలి. కంటెంట్ పరంగా యావరేజ్ సినిమా, టెక్నికల్ గా వీక్ ఉండడంతో.. ప్రస్తుత తరం ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

దర్శకుడు కృష్ణవంశీ “నటసామ్రాట్”ను తెలుగీకరించడంలో తీసుకున్న శ్రద్ధ అభినందనీయమైనప్పటికీ.. టెక్నికల్ గా ఇంకాస్త బెటర్ గా తీసి ఉంటే బాగుండేది అనిపించకమానదు. కంటెంట్ కంటే క్వాలిటీకే జనాలు ఎక్కువగా ఓటేస్తున్న ఈ తరుణంలో ఆయన క్వాలిటీని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం బాధాకరం. కృష్ణవంశీ మీద ఎంతో గౌరవం, అభిమానం ఉన్నప్పటికీ.. క్వాలిటీ లేని ఎడిటింగ్, డి.ఐ, సినిమాటోగ్రఫీల కారణంగా పూర్ క్వాలిటీ సినిమా చూస్తున్న భావన కలిగించే “రంగమార్తాండ”ను కొందరు ప్రేక్షకులు మెచ్చకపోవడాన్ని ఎవరూ నిలువరించలేరు. ఆయనలోని టెక్నీషియన్ ను బడ్జెట్ పరిమితులు తొక్కిపెట్టేశాయో లేక ఆయన అప్డేట్ అవ్వలేదో కానీ.. క్వాలిటీ పరంగా కృష్ణవంశీ నుంచి ఆశించే స్థాయి సినిమా అయితే ఇది కాదు. బ్రహ్మానందం, రమ్యకృష్ణల నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్న ఆయన దర్శకత్వ ప్రతిభను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

విశ్లేషణ: మన అమ్మానాన్నల కథగా కృష్ణవంశీ తెరకెక్కించిన “రంగమార్తాండ” ఒక మంచి సినిమా. టెక్నికాలిటీస్, కమర్షియల్ ఎలివెంట్స్ వంటివన్నీ పక్కనపెట్టి.. బ్రహ్మానందం నట విశ్వరూపం కోసం ఈ చిత్రాన్ని చూడండి. అక్కడక్కడా నవ్వించి, అప్పుడప్పుడూ ఆలోజింపజేసి.. చివరివరకూ రంజింపజేస్తుందీ చిత్రం.

రేటింగ్: బ్రహ్మానందం నట సామర్ధ్యానికి వెల కట్టలేం, ఈ చిత్రాన్ని రేటింగ్ తో కించపరచలేం.

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus