రంగస్థలం ఫస్ట్ రివ్యూ, రేటింగ్

  • March 29, 2018 / 01:46 PM IST

సుకుమార్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారిగా నటించిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రేపు రిలీజ్ కానుంది. ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు అందించిన ఫస్ట్ రివ్యూ మీ కోసం…

కథ

పాతికేళ్లక్రితం కథ. నేటితరం వారు పేరెంట్స్ నుంచి కథలుకథలుగా విన్న కథ. పాత కథ. పాత వైన్ మాదిరిగా కిక్ ఇచ్చే కథ. ఎంతో అందమైన గ్రామంలో అమాయకులను పీడించుకుని తినే సర్పంచ్.. ఆ సర్పంచ్ భారీ నుంచి తమ ప్రాంతాలను కాపాడుకోవాలని తపించే అన్నదమ్ములు. తనకి అడ్డుగా వచ్చాడని అన్నని చంపిస్తాడు సర్పంచ్.. చెవిటివాడు అయిన తమ్ముడు సింహం లాంటి సర్పంచ్ ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన రంగస్థలాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే కథ.

నవరసాల చిట్టిబాబు

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నవరసాలు పలికించారు. స్టార్ హీరోకోసమంటూ బిల్డప్ సన్నివేశాలు ఇందులో లేకపోయినప్పటికీ అనేక చోట్ల ప్రేక్షకులతో తన నటనతో చప్పట్లు కొట్టించారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కి అభిమానులు పెరిగిపోతారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

సమంత

ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.. అలుగుతూ.. అందంతో ఆకట్టుకునే సమంత ఈ చిత్రంలో పల్లెటూరి అమాయక పేద అమ్మాయిగా మెప్పించింది. ఆమె సహజమైన నటనతో మెస్మరైజ్ చేసింది.

సీరియస్ సర్పంచ్

విలన్ గా జగపతి బాబు అనేక సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఇందులో సర్పంచ్ గా అంతకు మించి నటించారు. అలనాటి కాలంలో సత్యనారాయణరావు, రావు గోపాలరావు, నాగభూషణం పోషించిన పాత్రలను గుర్తుకుతెచ్చారు.

టెర్రిఫిక్ డైరక్షన్

గ్రామాల్లో రాజకీయ హత్యను ప్రధానంగా తీసుకొని అందుకు కమర్షియల్ హంగులను జోడిస్తూ.. కథను తీసుకెళ్లిన విధానం చూస్తే సుకుమార్ ని అభినందించక ఉండలేము. ఇదివరకు సుకుమార్ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రచయిత, దర్శకత్వ బాధ్యతలను చక్కగా నెరవేర్చారు.

కలర్ ఫుల్ సినిమాటోగ్రఫీ

ప్రతి రోజు చూసే పూరి గుడెసెలు.. మట్టి రోడ్లు.. ఊరి పక్కన పారే గోదారి.. లను తన కెమెరా కంటితో రత్నవేలు కొత్తగా చూపించారు. పల్లెటూరిలోని అందాలను మరింత అందంగా తీశారు. ముఖ్యంగా “ఎంత సక్కగున్నావే” పాటలో అయితే రామ్ చరణ్ సమంత గురించి పాడుతుంటే.. ఊరు ఎంతసక్కగున్నదో అన్నట్టుగా మనకి చూపించారు.

హ్యాట్సాఫ్ రాక్ స్టార్

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పాటలతో అదరకొట్టారు. ఈ పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎక్కువ మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సమయంలో దేవీ ఇచ్చిన నేపథ్య సంగీతానికి అందరూ హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.

జిల్ జిల్ జిగేలు రాణి

డీజే బ్యూటీ పూజా హెగ్డే గురించి చెప్పకుండా ఈ రివ్యూ పూర్తి చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది. ఆమె జిల్ జిల్ జిగేలు రాణి పాటలో రామ్ చరణ్ కి పోటీగా స్టెప్పులు వేస్తుంటే కుర్చీలో ఉన్నవారికి హుషారు వస్తుంది. ఐదు నిముషాలపాటు హంగామా చేసింది.

చివరి మాట

మాస్ ప్రేక్షకులకు రంగస్థలం ఫుల్ మీల్స్ వంటిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాన్ని పంచుతుంది. క్లాస్ ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేసేలా సుకుమార్ ఈ చిత్రాన్ని మలిచారు

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus