రామ్ చరణ్-సుకుమార్ ల టెర్రిఫిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. రామ్ చరణ్ నయా లుక్ తో మాత్రమే కాక సరికొత్త యాస, క్యారెక్టరైజేషన్ తో ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రోమోస్ లో మెగా అభిమానుల ఆశలు అమాంతం పెంచేశాడు. ముఖ్యంగా రామ్ చరణ్-సమంత మొదటిసారి కలిసి నటించడం ఇక్కడ హైలైట్. ఈమధ్యకాలంలో ఏ సినిమాకీ లేనంత పాజిటివ్ రెస్పాన్స్ “రంగస్థలం” చిత్రానికి వచ్చింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, సుకుమార్ స్టైల్ ట్రైలర్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేయడంతో “రంగస్థలం” ప్రీబుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. మరి ఈ స్థాయి భారీ అంచనాలు క్రియేట్ చేసుకొన్న “రంగస్థలం” ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : ఫణీంద్ర భూపతిరాజు (జగపతిబాబు) “రంగస్థలం” గ్రామానికి 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఊరి ప్రజల్ని మోసం చేస్తూ పలువిధాలుగా గ్రామ ప్రజల్ని దోచుకుంటుంటాడు. మొదట్లో మాకెందుకులే అని ఎవరూ పట్టించుకోరు కానీ.. కుమార్ బాబు (ఆది పినిశెట్టి) మాత్రం ప్రజలకు అండగా నిలిచి ప్రెసిడెంట్ మోసాల నుంచి వారిని కాపాడాలనుకొంటాడు. అదే రంగస్థలంలో పోలాలకు మోటర్ వేస్తూ జీవనం సాగిస్తుంటాడు చిట్టిబాబు (రామ్ చరణ్). కుమార్ బాబుకు స్వయంగా తమ్ముడైన చిట్టిబాబు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోడు. కానీ.. అన్నయ్యకు వెన్నంటి నిల్చుంటాడు.
ఈ రంగస్థలంలో ఫణీంద్ర భూపతిరాజు-కుమార్ బాబుల నడుమ జరిగిన రాజకీయ రణంలో చిట్టిబాబు పోషించిన పాత్ర ఏమిటి? చివరికి ఎవరు నెగ్గారు? ఈ చదరంగంలో సుకుమార్ తనదైన పావులతో (స్క్రీన్ ప్లే) ఏ పాత్రని ఎలా రూపుదిద్దాడు అనేది “రంగస్థలం” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : ఇప్పటివరకూ రామ్ చరణ్ ని “సింగిల్ ఎక్స్ ప్రెషన్” ఆర్టిస్ట్ అంటూ వెటకారం చేసినవారందరూ ముక్కున వేలేసుకొనేలా చేశాడు రామ్ చరణ్. చెవిటి చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నట విశ్వరూపం ప్రదర్శించాడు. హావభావాల ప్రకటన మొదలుకొని డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నిట్లోనూ పర్ఫెక్షన్ చూపాడు. ఎమోషనల్ సీన్స్ లో సరికొత్త రామ్ చరణ్ ను చూస్తారు. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా “రంగస్థలం” చిత్రాన్ని పేర్కొనవచ్చు. సమంత సినిమాలో ఎక్కడా ఒక హీరోయిన్ లా కనిపించదు. రామలక్ష్మి అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ చిలిపిదనం, ఆ పొగరు, ఆ వగరు, ఆ సరసం, ఆ స్వచ్చమైన ప్రేమ.. ఇవన్నీ రామలక్ష్మి పాత్రలో ఆమె కళ్ళలో కనిపిస్తుంటాయి. అంత సహజంగా ఉంది ఆమె పాత్ర చిత్రీకరణ మరియు ఆమె నటన. ఆది పినిశెట్టి క్యారెక్టర్ చాలా నార్మల్ గా ఉన్నా.. అతడి నటన మాత్రం ప్రతి ఫ్రేమ్ లో పెద్దరికాన్ని, మంచితనాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పినట్లు చనిపోయే సీన్ లో ఆది పినిశెట్టి నటన అందరి మన్ననలు అందుకుంటుంది.
జగపతిబాబు పాత్రకి ఇచ్చినంత హైప్ చివరివరకూ కనిపించలేదు. అయితే.. మదమెక్కిన మోతుబారిగా ఆయన నటన మాత్రం అదరహో అనిపించేలా ఉంది. కాకపోతే.. ఆ పాత్రకి మొదట్లో ఉన్న వెయిట్ & వెల్యూ చివరివరకూ కొనసాగించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ఆశ్చర్యంగా ఈ సినిమాలో అనసూయ పాత్రకి విపరీతమైన వెయిటేజ్ ఇచ్చారు. ఊర్లోవారందరూ “రంగమ్మత్త” అని అభిమానంగా పిలుచుకొనే అందరి మనిషిగా ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఆ పాత్రను నేర్పుతో పోషించిన విధానం అభినందనీయం. రామ్ చరణ్ తర్వాత సినిమాలో ఆస్థాయి వేల్యూ ఉన్న క్యారెక్టర్ కూడా అనసూయదే కావడం విశేషం. ప్రకాష్ రాజ్ పాత్రను దర్శకుడు మలిచిన తీరు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే.. ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఏమీ చెప్పకూడదు. అయితే.. ప్రకాష్ రాజ్ మాత్రం దక్షిణామూర్తి అనే పాత్రలో జీవించేశాడు.
సుకుమార్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి పాత్రను వీలైనంత సహజంగా రాసుకోవడం వల్ల ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ పాత్రలకు పతాక స్థాయిళో న్యాయం చేశారు. సినిమాలో పాత్రలకు ప్రేక్షకులు ప్రయాణం చేసే స్థాయిలో వారి క్యారెక్టరైజేషన్స్ ఉండడం అనేది సినిమాకి మెయిన్ హైలైట్.
సాంకేతికవర్గం పనితీరు : సాధారణంగా సినిమాలో టెక్నికల్ అంశాల గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాటోగ్రఫీ లేదా సంగీతం గురించి చెబుతుంటామ్. కానీ “రంగస్థలం” విషయంలో మాత్రం ముందుగా ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ-మౌనిక దంపతుల గురించి చెప్పుకోవాలి. వారు “రంగస్థలం” గ్రామానికి, చిత్రానికి తమ కళా నైపుణ్యంతో ప్రాణం పోశారు. ప్రేక్షకుల్ని మూడు గంటలపాటు 1980 కాలం నాటి గ్రామంలోకి తీసుకెళ్లిపోయారు. వారి ప్రతిభకు పురస్కారాలు క్యూ కట్టడం ఖాయం.
రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఫ్రేమ్స్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. చనిపోయిన కుమార్ బాబు (ఆది పినిశెట్టి)ని చిట్టిబాబు (రామ్ చరణ్) భుజం మీద మోసుకొస్తుండగా.. అప్పుడే అంటిస్తున్న కుమార్ బాబు పోస్టర్ జనాల ఆశల్లాగే జారిపడిపోవడం అనేది దర్శకుడు మరియు రత్నవేలు కళాత్మకతకు నిదర్శనం. సినిమాకి ఒక నేటివిటీ, ఎమోషన్ ను రత్నవేలు కేవలం సీనియమాటోగ్రఫీతోనే తీసుకొచ్చాడు.
ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించాలి. సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి ఆయువు పట్టులా నిలిచాయి. సినిమాకి ప్రాణం పోశాయి. సన్నివేశంలోని ఎమోషన్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు దేవిశ్రీప్రసాద్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి తప్పకుండా ప్రస్తావించాల్సిందే. కథను, దర్శకుడిని నమ్మి ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యద్భుతంగా చిత్రాన్ని రూపొందించారు.
ఇక మన లెక్కల మాస్టారు సుకుమార్ గారి పనితనం గురించి మాట్లాడుకోవాలంటే.. సుకుమార్ శైలి క్యారెక్టరైజేషన్స్, ఆయన తరహా ఎమోషన్స్, సెంటిమెంట్స్, రిలేషన్స్ అన్నీ అత్యద్భుతంగా పండాయి. కాకపోతే.. ఎప్పట్లానే క్లైమాక్స్ విషయంలో మాత్రం కాస్త తన టిపికల్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనే అత్యాశతో అప్పటివరకూ సినిమా మీద ఫార్మ్ అయిన ఫీల్ ను పోగొట్టాడు. అప్పటివరకూ సంతుష్టుడిగా ఉన్న ప్రేక్షకుడి మదిలో క్లైమాక్స్ లెక్కలేనన్ని ప్రశ్నలు నింపింది. అయితే.. నటీనటుల నుంచి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టడం, కాస్త లెంగ్త్ ఎక్కువైంది అనిపించినా ఎక్కడా ప్రేక్షకుడి చూపు తెర మీద నుంచి కదల్చకుండా తీసుకొన్న జాగ్రత్తలు, అన్నిటికీ మించి సినిమాలోని ప్రతి పాత్రను అత్యంత సహజంగా అల్లిన విధానం, సెంటిమెంట్స్ ను ఎలివేట్ చేసిన తీరు మాత్రం దర్శకుడిగా సుకుమార్ స్థాయిని పెంచాయి.
విశ్లేషణ : రామ్ చరణ్ నట విశ్వరూపం, దేవిశ్రీప్రసాద్ ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్, రత్నవేలు సబ్టల్ సినిమాటోగ్రఫీ, సుకుమార్ శైలి ఎమోషన్స్ కోసం “రంగస్థలం” చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. అయితే.. కాస్త సాగదీసినట్లుగా అనిపించే సెకండాఫ్ ను, రన్ టైమ్ ను మాత్రం భరించాల్సి ఉంటుంది. అయితే.. ఆ సాగతీత కూడా సినిమాలోని ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికే అని అర్ధం చేసుకుంటే మాత్రం అవి మాత్రం మైనస్ అనిపించదు.