ఏ రంగంలోనైనా వ్యూహాలు తప్పని సరి. అదేనండి ప్లానింగ్. సినిమా రంగంలో అయితే కొంచెం డిఫెరెంట్. హీరోయిన్స్ అయితే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి.. వయసు పెరిగితే అవకాశాలు తగ్గుతాయి. క్రేజ్ తగ్గితే రెమ్యూనరేషన్లో కోత పడుతుంటుంది. అందుకే వచ్చామా.. హిట్స్ అందుకున్నామా.. కోట్లు వెనకేసుకున్నామా.. అని ఉంటారు చాలామంది. కొంతమంది మాత్రం కొన్ని అద్భుతమైన పాత్రలను వెనకేసుకోవాలనుకుంటారు. ఈ రెండు దారులను రష్మిక ఎంచుకోవడంలేదు. కన్నడలో కిరిక్ పార్టీ తో పాపులర్ అయిన రష్మిక తెలుగులో ఛలో మూవీతో అడుగుపెట్టి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చేసిన “గీతగోవిందం” అయితే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టింది.మూడవ చిత్రం దేవదాస్ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
వరుసగా ఆమె నటించిన మూడు చిత్రాలు హిట్ అవ్వడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రేజ్ ని ఆమె క్యాష్ చేసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఎక్కువకాలం పరిశ్రమలో ఉండేలా అందరితోనూ మంచిగా ప్రవర్తిస్తోందని దర్శకనిర్మాతలు కితాబు ఇస్తున్నారు. మంచి పాత్ర అయితే రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవడానికి సిద్ధపడుతోందని సమాచారం. అంతేకాదు షో రూమ్ ఓపెనింగ్స్ కి కూడా ఎక్కువగా డిమాండ్ చేయడం లేదని తెలిసింది. రష్మిక కేవలం 5లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందని టాక్. రష్మికకి ఉన్న క్రేజ్ చూసి పది లక్షలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంటే.. ఆమె మాత్రం అందరి మనసులు గెలుచుకోవడానికి అడుగులు వేస్తోంది.