Ravi Teja: ఇన్నేసి సినిమాలు వరుస రిలీజ్లు రవితేజ ఫ్యాన్స్కి పండగే!
November 9, 2022 / 04:11 PM IST
|Follow Us
సినిమా హీరోలకు వేగం, వైవిధ్యం, నాణ్యత కచ్చితంగా ఉండాలి. అంటే సినిమా కథలను ఎంచుకోవడం.. షూట్ పూర్తి చేసి విడుదల చేయడంలో వేగం ఉండాలి. ఇక వరుసగా సినిమాలు చేస్తున్నట్లు వైవిధ్యం, నాణ్యత చూసుకోవాలి. అయితే ఈ మూడు విషయాల్లో తొలి విషయాన్ని పక్కాగా పాటిస్తున్న హీరో రవితేజ. రెండు, మూడు విషయాల్లో కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఇప్పడు ఈ చర్చ ఎందుకు అంటే రాబోయే ఏడాది కాలంలో రవితేజ నుండి నాలుగు సినిమాలు వచ్చే అవకాశం ఉండటమే.
హీరో అయినప్పటి నుండి రవితేజ ఎప్పుడు ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకున్నది లేదు. వరుసగా ఏదో సినిమా ఓకే చేస్తూనే ఉన్నారు. మహా అయితే, ఒకట్రెండు సార్లే గ్యాప్ వచ్చింది. కరోనా పరిస్థితుల తర్వాత అయితే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. జయాపజయాల లెక్క పక్కన పెట్టి చూస్తే.. ఇంత బిజీ హీరో టాలీవుడ్లో ఈ మధ్య లేరు అనే చెప్పొచ్చు. ఇప్పుడు వరుసగా నాలుగు రిలీజులతో అభిమానులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు.
ఈ ఏడాది డిసెంబర్ 23న ‘ధమాకా’తో మాస్ మహారాజ ఫీస్ట్ మొదలవ్వబోతోంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ..లో మాస్ కంటెంట్ ఫుల్ డోస్లో ఉందంటున్నారు. శ్రీలీల గ్లామర్ సినిమాకు ప్లస్ అంటున్నారు. ఇక్కడ అక్కడికి మూడు వారాల్లో చిరంజీవితో కలసి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర నిడివి 40 నిముషాలు ఉంటుందన్నారు. కాబట్టి దీన్ని అతిథి పాత్ర అనలేం.
ఆ సినిమా తర్వాత నాలుగు నెలల గ్యాప్ తీసుకొని ‘రావణాసుర’గా వస్తాడు రవితేజ. ముందుగా అనుకున్నట్లు వస్తే.. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా అయితన వెంటనే కార్తీక ఘట్టమనేని డైరెక్షన్లో ‘ఈగల్’ అనే సినిమా వస్తుంది. సెప్టెంబరులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ పనులు మొదలవుతాయట ఈ సినిమా కోసం రవితేజ మేకోవర్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఈ సినిమా వచ్చే ఏడది రాకపోవచ్చు అంటున్నారు. ఒక్కటే విషయం ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటీవల ఇబ్బంది పెట్టాయి. కాబట్టి వాటి నుండి గుణపాఠాలు నేర్చుకునుంటే తర్వాతి సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు.