కొత్తగా ప్రయత్నిస్తే సినిమాలు ఫ్లాపవుతున్నాయి!! : రవితేజ

  • July 8, 2020 / 12:04 PM IST

“కొత్త తరహా సినిమాలు చేయాలని, సరికొత్త పాత్రలు పోషించాలని నాకూ ఉంటుంది. కానీ అలా ప్రయోగాలు చేస్తుంటే జనాలు చూడడం లేదు, సినిమాలేమో ఫ్లాపవుతున్నాయి. అందుకే ప్రయోగాలు చేయాలంటే భయమేస్తుంది. అయితే.. ఈమధ్యకాలంలో ప్రేక్షకుల ఆలోచనాధోరణిలో మాత్రమే కాదు వారు సినిమాలు చూసే పద్ధతిలోనూ భారీ మార్పులు వచ్చాయి. సో, భవిష్యత్ లో ప్రయోగాలు చేసే ఆలోచన ఉంది కానీ.. ఇప్పుడైతే చేతిలో మూడు సినిమాలున్నాయి. అవి పూర్తయ్యాక వేరే సినిమాల గురించి ఆలోచిస్తాను” అంటూ తన సినిమాలను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటున్నారు అనే విషయాలతోపాటు ఆయన తాజా చిత్రం “టచ్ చేసి చూడు” గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చారు మాస్ మాహారాజా రవితేజ.

సరదా పోలీస్ పాత్రలో..
ఇప్పటివరకూ నేను చేసిన పోలీస్ పాత్రలన్నీ అయితే “విక్రమార్కుడు” తరహాలో సీరియస్ రోల్స్ లేదా “పవర్” తరహాలో కామెడీ పోలీస్ లా కనిపించాను. కానీ.. మొదటిసారి “టచ్ చేసి చూడు” సినిమాలో కామెడీతోపాటు సెంటిమెంట్, రెస్పాన్సబిలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాను. ఉద్యోగంతోపాటు కుటుంబ బాధ్యతలను కూడా సమాంతరంగా నిర్వర్తిస్తుంటాను.

విక్రమ్ కథను డీల్ చేసిన విధానం నచ్చింది..
“టచ్ చేసి చూడు”లో చాలా స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మాస్ ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక పాత్రల తీరుతెన్నులు కూడా వైవిధ్యంగా ఉంటాయి. కానీ.. నాకు విక్రమ్ సిరికొండలో బాగా నచ్చిన అంశం అతను సినిమాని డీల్ చేసిన విధానం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా తనకున్న ఎక్స్ పీరియన్స్ ను బాగా రంగరించి “టచ్ చేసి చూడు” చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. నాకు అతను పర్సనల్ గా “మిరపకాయ్” సినిమా టైమ్ నుంచి తెలుసు.

మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్..
టెక్నికల్ గా సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. “టచ్ చేసి చూడు” సినిమా కోసం ప్రీతం టీం సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఆ పాటలకి చాలా కొత్తగా ఉన్నాయంటూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది చెప్పండి.

ఆ నాలుగు సినిమాలు ఆడి ఉంటే ప్రయోగాలు చేసేవాడ్ని..
“నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, ఈ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే” లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పుడు జనాలు ఆదరించలేదు. బహుశా ఆ సినిమాలు ఆడితే ఆ తరహా చిత్రాలు చేయడానికి మొగ్గు చూపేవాడ్నేమో కానీ ఇప్పుడప్పుడే ప్రయోగాల జోలికి వెళ్ళే ఆలోచన లేదు. కానీ.. భవిష్యత్ లో తప్పకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తాను.

ఆ సినిమా ఇప్పుడు రిలీజైతే హిట్ అయ్యేదేమో..
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే విధానం, కొత్త తరహా చిత్రాలను ఆదరించే పద్ధతిలో విశేషమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు అనిపిస్తుంటుంది ఒకవేళ “నా ఆటోగ్రాఫ్” ఇప్పుడు రిలీజ్ అయితే మంచి హిట్ అయ్యేదేమో అని.

నన్ను ఎవరినో అనుకొంటున్నారేమోనాని భయపడ్డా..
“రాజా ది గ్రేట్” షూటింగ్ కోసం డార్జీలింగ్ వెళ్లినప్పుడు అక్కడ జనాలు నన్ను ఏదో తెలిసినట్లుగా చూస్తుంటే “నన్ను ఎవరో అనుకుంటున్నారేమో?” అనుకొన్నాను. కట్ చేస్తే తెలిసిందేమిటంటే నేను తెలుగులో నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిందీలో డబ్బింగ్ రూపంలో సెట్ మ్యాక్స్ చానల్ లో వారానికి కనీసం రెండైనా ప్లే అవుతాయట. అందులో నన్ను చూసినవాళ్ళందరూ నన్ను గుర్తుపడుతున్నారు.

ఆ సంవత్సరం గ్యాప్ అలా ఉపయోగపడింది..
“బెంగాల్ టైగర్” తర్వాత దాదాపు ఏడాది బ్రేక్ తీసుకొన్నాను. ఆ గ్యాప్ లో ఎన్నో ప్రదేశాలు చూసాని, అసలు అప్పటివరకూ చూడలేకపోయిన కొన్ని వందల సినిమాలు, టీవీ సిరీస్ లు చూశాను. ఆ గ్యాప్ తీసుకోవడం నాకు చాలా ఉపయోగపడింది. నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి ఆ గ్యాప్ బాగా ఉపయోగపడింది.

కొత్త డైరెక్టర్ల క్లారిటీ నచ్చింది..
కొత్తతరం దర్శకులు చాలా మంచి ఐడియాస్ తో వస్తున్నారు. వాళ్ల స్క్రిప్త్స్ చాలా బాగుంటున్నాయి. కొన్నైతే ఆశ్చర్యపరుస్తున్నాయి కూడా. వాళ్ళతో కలిసి పని చేసేప్పుడు నాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది. భవిష్యత్ లో ఎక్కువగా యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంది.

అండగా నిలవాలనుకొంటే మనకి అడ్రస్ ఉండదు..
ఏదో శ్రీనువైట్ల నన్ను కథానాయకుడిగా పరిచయం చేశాడనో లేక అతను నాకు మంచి స్నేహితుడనో అతనితో సినిమా చేయడానికి అంగీకరించలేదు. అతను చెప్పిన కథ నచ్చింది. అందుకే అతనితో సినిమా చేయడానికి అంగీకరించానే కానీ ఏదో అతనికి బ్యాక్ అప్ ఇద్దామనో, ఆదుకుందానే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. అయితే.. అలా ఆదుకోవడానికి ప్రయత్నిస్తే మనం అడ్రస్ లేకుండాపోతామ్.

ఒళ్ళు దగ్గరపెట్టుకొని కథలు సెలక్ట్ చేసుకొంటున్నాను..
ఒక నటుడిగా నా కెరీర్ మొదలై రెండు దశాబ్ధాలవుతుంది. మొదట్లో నేను కథలు ఎంచుకొనేప్పుడు చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అనిపించినా పెద్దగా పట్టించుకొనేవాడ్ని కాదు. “ఆ ఏముందిలో ఆడేస్తాయి” అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు నా స్క్రిప్ట్ సెలక్షన్ లో మార్పులు వచ్చాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా కథలు వింటున్నాను. ఏ చిన్న లోపం కనిపించినా సరిచేయమని చెబుతున్నాను.

నాకంటే బాగా చేశాడంటున్నారు..
“రాజా ది గ్రేట్”లో మా అబ్బాయి మహాధన్ ను నటుడిగా పరిచయం చేయాలన్న ఆలోచన డైరెక్టర్ అనిల్ రావిపూడిది. వాడెలా నటించాడనేది స్క్రీన్ పై చూసి నేనే ఆశ్చర్యపోయాను. కొందరైతే అంధుడి పాత్రలో నీకంటే మహాధన్ బాగా చేశాడు అన్నారు. అంతకుమించిన సంతోషం ఏముంటుంది చెప్పండి.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus