నాగార్జున ఏ ముహూర్తాన “హలో” ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇది అఖిల్ ఎంట్రీ సినిమా అని అన్నాడో తెలియదు కానీ.. అప్పట్నుంచి ప్రతి సినిమా అఖిల్ ఎంట్రీ సినిమాలాగే అయిపొయింది. ఎంట్రీ, రీఎంట్రీ, రీరీఎంట్రీ, రీరీరీఎంట్రీ ఇలా ప్రతి సినిమాకి “రీ” అనేది యాడ్ అవుతూనే ఉంది కానీ.. సక్సెస్ అనే మాటకు దూరంగానే ఉండిపోయాడు అఖిల్. ఆఖరికి స్టార్ మేకర్ అల్లు అరవింద్ మన అఖిల్ బాబుకి సక్సెస్ కట్టబెట్టే పనిని భుజాన వేసుకుని..
బొమ్మరిల్లు భాస్కర్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాకు శ్రీకారం చుట్టి, సినిమాలో సగం బడ్జెట్ పెట్టి మరీ పూజా హెగ్డేను హీరోయిన్ గా పెట్టి, సిద్ శ్రీరామ్ తో ఒక పాట పాడించి, ఆ పాటను సోషల్ మీడియాలో హిట్ చేయించి.. ఇలా ఎన్ని చేయించినా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా మీద పాజిటివ్ వైబ్ మాత్రం తీసుకురాలేకపోయారు. విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకోలేకపోయింది. లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ చేసేద్దామని అనుకున్నప్పటికీ.. షూటింగ్ పూర్తవ్వక ఆలోచనను పక్కన పెట్టారు.
అయితే.. తొలుత సంక్రాంతి లేదా ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేద్దామనే ఆలోచనకు కూడా ఇప్పుడు బ్రేక్ పడిందని తెలుస్తోంది. అందుకు కారణం కొన్ని సన్నివేశాల అవుట్ ఫుట్ లో నిర్మాతల బృందం సంతోషంగా లేకపోవడంతో. దాంతో అయ్యగారి రీరీరీ ఎంట్రీకి రీషూట్లు మొదలయ్యాయి. మరి సినిమా ఎప్పటికి విడుదలవుతుందో చూడాలి.