నటసింహ బాలకృష్ణ గౌతమి శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమాని అత్యంత వేగంగా పూర్తి చేసి ఔరా అనిపించారు. పైసా వసూల్ తర్వాత కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాని చేస్తున్నారు. నయన తార ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో సినిమాకు సంబంధించి భారీ ఫైట్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపు 60 శాతం కంప్లీట్ అయినట్టే. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ గా రెజీనా ను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది.
ఈ చిత్రంలో ఇప్పటికే నయనతార తో పాటు నటాషా, హరిప్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాలుగో హీరోయిన్ గా రెజీనా ఎంపిక అయిందని వార్త షికారు చేసింది. ఈ వార్తలను రెజీనా కొట్టి పడేసింది. బాలకృష్ణ 102 సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ బ్యూటీకి తెలుగు కలిసి రాకపోవడంతో తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇవి హిట్ అయితే కోలీవుడ్ లో రెజీనా స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ.