Publicity Designer Eswar: ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత
September 21, 2021 / 11:20 AM IST
|Follow Us
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పబ్లిసిటీ డిజైనర్‌గా జీవితం ప్రారంభించిన ఈశ్వర్ అనేక అపురూప చిత్రాలకు పోస్టర్లు రూపొందించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు ఈశ్వర్. చిన్నతనం నుండి బొమ్మలు గీయడమంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి అడుగుపెట్టారాయన.
చిన్నతనంలోనే స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గాంధీ బొమ్మ వేసి మన్ననలు పొందారు ఈశ్వర్. అయితే బొమ్మలపై ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో చదువును మధ్యలోనే ఆపేశారు. స్నేహితుడి సాయంతో మద్రాస్‌కు వెళ్లి పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆర్టిస్ట్ కేతా దగ్గర పోస్టర్ డిజైనింగ్ విభాగంలో మెలకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ‘ఈశ్వర్’ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీ ఏర్పాటు చేశారు.
దివంగత ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారయన. ‘సాక్షి’ సినిమా కలర్ పోస్టర్లు, లోగోలను ఈశ్వరే తీర్చిదిద్దారు. ‘పాప కోసం’ సినిమా కోసం బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్‌తో పోస్టర్ల రూపొందించారు. అలా 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2,600లకు పైగా చిత్రాలకు పని చేశారు.
విజయ ప్రొడక్షన్స్ , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి మూవీస్ తదితర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ని రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది.