దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే పాపం అనిపిస్తోంది : రేణుదేశాయ్
April 17, 2018 / 07:46 AM IST
|Follow Us
నిర్భయ ఘటన తర్వాత మళ్లీ దేశం మొత్తం రగిలిగిపోతున్న ఘటన ఆసిఫా జీవితాన్ని చిదిమేయడం. ఏమిదేళ్లపాపని ఐదు మంది మృగాళ్లు దారుణంగా రేప్ చేసి చంపేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికపై గళం వినిపిస్తున్నారు. తాజాగా అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ స్పందించారు. ‘‘ఆసిఫా, నిర్భయ, ఉన్నావ్.. వీళ్లందరూ వివిధ వయసులకు చెందిన వారు, కులాల రిత్యాగానీ.. ప్రాంతాల రిత్యాగానీ.. వీరికి ఎటువంటి సంబంధం లేదు. కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బాధితులంతా ఆడపిల్లలే.
ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోంది.” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఏమి చెప్పారంటే.. “ఆడపిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులను నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సోషల్ మీడియాలో, అనేక చర్చా వేదికల్లో, రోడ్లపై ర్యాలీల రూపంలో మన నిరసనను తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు ఆగట్లేదు. ఈ చర్యలకు పాల్పడే రాక్షసుల్లో ఎటువంటి మార్పూ రావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ ఘటనలు ఆగుతాయి. అప్పటి వరకూ ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.’’ అని రేణు ట్వీట్ చేశారు.