16 ప్రశ్నలు 16 గంటలు.. చంద్రబాబుకి వర్మ డెడ్ లైన్..!
April 29, 2019 / 04:30 PM IST
|Follow Us
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ విడుదలయ్యి మంచి హిట్ గా నిలిచింది. అయితే ఎన్నికల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రాన్ని విడుదల కనివ్వలేదు అక్కడి ప్రభుత్వం. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీల పై నెగటివ్ గా తీశారు కాబట్టి… నారా,నందమూరి ఫ్యామిలీలో అలాగే కొందరు టీడీపీ నేతలు కూడా అడ్డుకున్నారు. అయితే ఎన్నికలయిపోయి కాబట్టి ఈ చిత్రాన్ని మే 1 న విడుదల చేయాలని భావించాడు వర్మ. ఇందులో భాగంగా విజయవాడలో ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు వర్మ. అయితే ఏపీ పోలీసులు దీనికి అడ్డుపడ్డారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్ల కోసం విజయవాడ వెళ్ళిన వర్మని పోలీసులు మధ్యలోనే ఆపేసి తిరిగి హైదరాబాద్ పంపించేశారు. ఈ విషయంపై తాజాగా వర్మ హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఇందులో భాగంగా.. చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా 16 ప్రశ్నలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు వర్మ. ఈ 16 ప్రశ్నలకు 16 గంటల్లలో సమాధానం ఇవ్వకపోతే.. కోర్టుని ఆశ్రయిస్తానని కూడా బెదిరించాడు. వర్మ 16 ప్రశ్నాలు ఏంటంటే :
1. నన్ను ఎయిర్ పోర్ట్ నుండి హోటల్ కు వెళ్తున్న క్రమంలో పోలీసులు నా కారు ఎందుకు ఆపారు? నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి?
2. వాళ్ళకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు – ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి?
3. ఎయిర్ పోర్ట్ లో నన్ను 7 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసారు. నన్ను ఎవర్నీ కలవకుండా.. అసలు బయటకు రాకుండా ఎందుకు చేశారో చెప్పండి?
4. పత్రికా సమావేశానికి శాంతి భద్రతా సమస్య కారణమని పోలీసులు చెప్తున్నారు. కానీ నన్ను విజయవాడకు వెళ్ళకుండా – నన్ను గంటల పాటూ నిర్బంధించి నన్ను తిరిగి వెళ్ళడానికి బలవంతం చేసిన దాని పై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఎందుకు ?
5. నా స్నేహితులున్న చోట నా ప్రెస్ మీట్ ను ఎందుకు అడ్డుకున్నారు . నాకు వాక్ స్వాతంత్ర్యం లేదా ? అది నా హక్కు కాదా ?
6. డీజీపీ తో – సీపీ తో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ? వారెందుకు నిశ్శబ్దం వహించారు?
7. నన్ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు నన్ను అరెస్టు చేయడానికి తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు చెప్పడానికి ఎందుకు తిరస్కరించారు?
8. రాజకీయ యంత్రాంగాలు నడిపించే పోలీసు యంత్రాలుగా పని చేస్తున్నారా ? ఇది కేవలం కేర్ టేకర్ ప్రభుత్వం కావడంతో డి.జి.పి. మరియు సిపి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల వివరణ ఇవ్వాలి ?
9. ఇది ఒక వ్యక్తి యొక్క నిర్ణయమా లేక సమిష్టి నిర్ణయమా మరియు ఏ కారణాలపైనా అనేది చెప్పాలి ?
10. పోలీస్ చర్య ఏకపక్షంగా మరియు విచిత్రమైనదిగా ఉండకూడదు . ముఖ్యంగా ప్రతి పోలీసు చర్య – ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన వ్యక్తులు లేదా సమూహాల హక్కులు మరియు స్వేచ్ఛలను నిరోధించేలా ఉండరాదు . ఒకవేళ అలాంటి పక్షంలో స్పష్టంగా ఆ అంశంపై క్లారిటీ ఇవ్వాలి ?
11. నన్ను ఆపే ఈ పోలీసు చర్య ఒక పాలనాపరమైన నిర్ణయమా ?
12. తనవల్ల నిబంధనల – చట్టాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? – అటువంటి తీవ్రమైన చర్యలు ఏకపక్షమైన ఉన్నత స్థాయి నిర్ణయాలు ఆధారంగా మాత్రమే ఉంటాయి. నా హక్కులు – స్వేచ్ఛకు భంగం కలిగించిన నిర్ణయం తీసుకున్న వారిని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకీ వారెవరు?
13. డీజీపీ దీనిపై వివరణ ఇవ్వాలి. నన్ను అడ్డుకున్న నిర్ణయం ఆయనదా ? లేకా మరెవరి ప్రోద్బలం ఉందా అనేది చెప్పాలి ?
14. పోలీస్ యంత్రాంగాలు స్పష్టంగా పక్షపాత – రాజకీయ – మరియు కేర్ టేకర్ ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడుతున్నారా ?
15. ఒక గదిలో ప్రెస్ మీట్ పెట్టుకోవటం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించాడు. అయినప్పటికీ ఆడుకోవటం పక్షపాత ధోరణికి నిదర్శనం కాదంటారా ?
16. నా చివరి ప్రశ్న – శ్రీ చంద్రబాబు నాయుడు గారు – ఇది: ఒక ప్రజాస్వామ్య భారతదేశమా లేదా నియంతృత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ?
ఇలా చంద్రబాబు ప్రభుత్వానికి 16 ప్రశ్నలు వేసాడు వర్మ. ప్రశ్నలైతే వేసాడు కానీ.. వీటిని ఎవరైనా పట్టించుకుంటరా. కోర్టుకి వెళ్లినా ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో వర్మ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఏదేమైనా తన పంతం నెగ్గే వరకూ అస్సలు ఆగేలా లేడు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.