సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు సైతం ఆర్జీవీ పేరు చెబితే తెగ టెన్షన్ పడతారు. వివాదాల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ నిత్యం సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తెలుగులో దాదాపు అన్ని జోనర్ల సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవీ పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు సేవ చేసే ఉద్దేశం అస్సలు లేదని ఆర్జీవీ తెలిపారు.
ఈ మధ్య కాలంలో మోదీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వర్మ స్పార్క్ ఓటీటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రాజకీయాల గురించి మాట్లాడారు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని తనకు తాను సేవ చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదని వర్మ పేర్కొన్నారు. రాజకీయ నేతలు పవర్, ఫేమ్ కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కానీ ప్రజాసేవ అంటూ వాళ్లు పైపై మాటలు చెబుతారని ఆర్జీవీ అన్నారు. స్పార్క్ ఓటీటీ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు ఓటీటీ చేరువవుతుందని చెప్పారు.
తనకు పరిచయం ఉన్న వ్యక్తితో కలిసి ఈ నెల 15వ తేదీన స్పార్క్ ఓటీటీని ప్రారంభిస్తున్నానని ఆర్జీవీ వెల్లడించారు. ఈ ఓటీటీలో అన్ని రకాల సినిమాలు అందుబాటులో ఉంటాయని డీ కంపెనీ సినిమాను తాను స్పార్క్ ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నానని ఆర్జీవీ పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం జీవితం గురించి కొన్ని గంటలలో చెప్పడం సాధ్యం కాదని అందుకే అతని జీవితాన్ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నామని ఆర్జీవీ వెల్లడించారు. ఆర్జీవీ రాజకీయాల్లోకి రానని కామెంట్స్ చేయడంతో కొందరు రాజకీయ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారని తెలుస్తోంది.