చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించడం అంటే అంత ఈజీ కాదు. భారీ బడ్జెట్ సినిమాలకు వచ్చే లాభాల పర్సెంటేజీ కంటే కొన్ని చిన్న సినిమాలు ఎక్కువ సంపాదిస్తున్నాయి. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కచ్చితంగా ప్రస్తావించాల్సిన సినిమా ‘కాంతార’. సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సుమారు రూ. 450 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
కొన్ని సినిమాలకు భాషతో పని లేదు. ఏ భాషలో తెరకెక్కించినా చూస్తారు. అలాంటి సినిమాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఈ సినిమా కన్నడనాట తెరకెక్కింది. అయితేనేం దేశవ్యాప్తంగా భారీ వసూళ్ల మోత మోగించింది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని, వస్తుందని చాలా మంది అనుకున్నారు. టీమ్‌గా కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందని వార్తలొచ్చాయి. కానీ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనుంది. అధికారికంగా ఈ విషయాన్ని ఇటీవల టీమ్ ప్రకటిచింది. ఈ క్రమంలో సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఎందుకు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.
‘కాంతార 1’ సినిమా ప్రాచీన కదంబ రాజవంశానికి చెందిన కథట. ఈ సినిమా స్క్రిప్ట్, మాటలు, ప్రొడక్షన్ పనులు అయిపోయాయి. డిసెంబరు చివరి వారంలో కర్ణాటక తీర ప్రాంతంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తారట. అయితే సీక్వెల్ ఎందుకు చేయలేదు అని రిషబ్ శెట్టిని అడిగితే… అందరికంటే భిన్నంగా ఆలోచించాం అందుకే ప్రీక్వెల్ చేశాం అని చెప్పారు. నిర్మాత విజయ్, తాను చాలాసార్లు చర్చించుకొని ప్రీక్వెల్ ఆలోచన చేశాం అని క్లారిటీ ఇచ్చారు.
‘కాంతార 1’ సినిమా కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదల చేస్తారట. అలాగే ఇంగ్లిష్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని రక్షిత్ చెప్పారు. ‘కాంతార’ విజయం మీ మీద ప్రభావం చూపించిందా అని అడిగితే… ‘కాంతార’ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేను అని, అందుకే ఆ ఆలోచన లేకుండా సినిమాలు చేస్తున్నాను అని చెప్పారు రిషబ్ శెట్టి.