Rocketry: The Nambi Effect Review: రాకెట్రీ సినిమా రివ్యూ & రేటింగ్!
July 1, 2022 / 04:16 PM IST
|Follow Us
తప్పుడు కేసులో జైలుకు పంపబడిన భారతీయ శాస్త్రవేత్త పద్మభూషన్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవ్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం “రాకెట్రీ- ది నంబి ఎఫెక్ట్”. హిందీ, తమిళం భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో మాధవన్ విజయాన్ని అందుకున్నారో లేదో చూడాలి.
కథ: ఇండియన్ రాకెట్ రీసెర్చ్ కు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ను పరాయిదేశానికి లీక్ చేశాడనే కేసులో జైలుకు వెళతాడు నంబి నారాయణన్ (మాధవన్). 50 రోజులపాటు జైల్లో మగ్గిన తర్వాత.. బయటకు వచ్చి, ఒంటరిగా తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం పోరాటం మొదలుపెడతాడు.
అసలు దేశానికి గర్వకారణమైన శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను దేశద్రోహిగా చిత్రీకరించింది ఎవరు? నంబి ఒంటరి పోరాటంలో విజయం సాధించడానికి అడ్డంకిగా నిలిచింది ఎవరు? సహాయపడింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్”.
నటీనటుల పనితీరు: తాను నటించే ప్రతి చిత్రం యొక్క పాత్రలో పరకాయ ప్రవేశం చేసే మాధవన్.. ఈ చిత్రంలో నంబి నారాయణన్ గా నటించడానికి తన శరీరాకృతిని సైతం మార్చుకొన్న విధానం ప్రశంసనీయం. ఈ చిత్రానికి ఆయన దర్శకుడు, నిర్మాత కూడా అవ్వడం వల్ల ఇంకాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడు మాధవన్. పోలీస్ స్టేషన్ & కోర్ట్ సీన్స్ లో మాధవన్ కన్నీరు పెట్టిస్తాడు.
మాధవన్ సరసన సిమ్రాన్ ను చూసి చాలా కాలమవ్వడంతో.. వాళ్ళ పెయిర్ కంటికింపుగా ఉంది. షారుక్ ఖాన్/సూర్యల గెస్ట్ అప్పీరియన్స్ సినిమాకు, కథనానికి మంచి వేల్యూ యాడ్ చేసింది. మిగతా క్యాస్ట్ అంతా తమ పాత్రకు తగ నటనతో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమాలోని ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు. శిరీష సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. రాకెట్ ఇంజెన్ ను చూపించిన విధానం, టింట్ యూసేజ్ & కలర్ గ్రేడింగ్ లో పర్ఫెక్షన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడిగా మాధవన్ తన పనితనంతో అలరించినప్పటికీ.. కథకుడిగా మాత్రం బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడు.
చాలా డెప్త్ ఉన్న కథకు కథనం చాలా ముఖ్యం అనే విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు మాధవన్. కోర్ట్ ప్రొసీడింగ్స్ చాలా పేలవంగా ఉన్నాయి. అలాగే.. నంబి నిజాయితీని ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో పరిచయం చేయలేకపోయాడు. నిర్మాతగా ప్రొడక్షన్ డిజైన్ విషయంలో రాజీపడలేదు కానీ.. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఇంకాస్త డీటెయిలింగ్ అవసరం.
విశ్లేషణ: రాకెట్రీ చిత్రానికి మాధవన్ నటుడిగా, దర్శకుడిగా లెక్కకుమిక్కిలి అవార్డులు దక్కించుకునే అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. కమర్షియల్ గా ఎంతవరకూ వర్కవుటవుతుంది అనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి అంచనా వేయడం కష్టం. అయితే.. మాధవన్ పనితనం కోసం, నంబి నారాయణన్ ఇన్స్పిరింగ్ లైఫ్ స్టోరీ కోసం ఈ చిత్రాన్ని చూడాల్సిందే.