తెలుగు చిత్ర పరిశ్రమలోని కొంతమంది హీరోలు, వారిని అభిమానించే వారిపై ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విరుచుకు పడ్డారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న పరిస్థితులను విమర్శించే ధైర్యం తనకు లేదంటూనే విమర్శలు సంధించారు. ఎప్పుడూ మృదు మధురంగా పాటలు పాడే బాలు నోటి వెంట ఆగ్రహ జ్వాలలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ “పరాయి భాషా వారికి జాతీయ అవార్డులు వస్తున్నాయని ఆవేదన చెందడమే కానీ ఎప్పుడైనా టాలీవుడ్ హీరోలు తెలుగు జాతి గర్వించే సినిమా ఒక్కటైనా తీయడానికి ప్రయత్నించారా? .. కనీసం ఆభిమానులైనా మంచి సినిమాని తీయమని తమ హీరోని అడిగారా? ” అంటూ ప్రశ్నలు గుప్పించారు.
సదరు హీరోలు, ఫ్యాన్స్ ఆత్మ విమర్శ చేసుకుంటే గొప్ప చిత్రాలు వస్తాయని సూచించారు. చిన్న చిత్రాల వారికీ థియేటర్స్ దొరకని వైనాన్ని సైతం బయటపెట్టారు. “మంచి సినిమాలకు ఆదరణ కరవవుతోంది. అందుకు ఉదాహరణ నేను నటించిన ‘మిథునం’ చిత్రమే. ఆ చిత్రానికి అప్పట్లో 10 థియేటర్లకు మించి ఇవ్వలేదు. కానీ ఆన్‌లైన్‌లో, టీవీల్లో ఆ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉందని ఎంతోమంది చెప్పారు. పెద్ద సినిమాలకు రాష్ట్రంలోని వేల థియేటర్లను నిర్మాతలు బుక్ చేసుకుంటున్నారు. మరి చిన్న సినిమాలను ఎక్కడ ఆడించాలి?’’ అంటూ బాలు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గాన గంధర్వుడి మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.