Sagar K Chandra: ‘భీమ్లా..’ సాగర్ సినిమా ప్రయాణం గురించి మీకు తెలుసా?
March 2, 2022 / 04:53 PM IST
|Follow Us
మంచి చదువు, పెద్ద జీతం.. ఇవన్నీ వదులుకొని సినిమాల్లోకి వచ్చేశాడు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే అది సినిమా ఇండస్ట్రీ ఎందుకవుతుంది. సినిమాలో ఉండాల్సిన మలుపులు కొన్ని ఆ కుర్రాడి రియల్ లైఫ్‌లో కనిపించాయి. అతనే సాగర్ కె. చంద్ర. ‘అయ్యారే’ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలోకి వచ్చిన సాగర్ చంద్ర… రీసెంట్గా ‘భీమ్లా నాయక్’ లాంటి పవర్ఫుల్ హిట్ ఇచ్చాడు. అసలు సాగర్ చంద్ర ఎవరు? ఏంటి అతని కథ అని అందరూ వెతుకున్నారు. మీరూ అలా వెతుకుతున్నట్లయితే… మీ కోసమే ఈ వార్త.
సాగర్ చంద్రకు చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో సినిమా అనే ఆలోచనే లేదు. బాగా చదువుకుని అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు ‘నేను డైరెక్టర్ అవుతా’ అంటూ ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేశాడు. సాగర్ చెప్పిన మాట విన్న అమ్మానాన్న షాక్ అయ్యారట. అమెరికాలో మాస్టర్స్ చేసేటప్పుడు సాగర్ చంద్రకి సినిమాల మీద ఇష్టం కలిగిందట. దీంతో ఇంట్లో వాళ్ల పూర్తి సమ్మతి లేకుండానే ‘అయ్యారే’ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చేసి ఇంట్లో కూడా ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.
సాగర్ చంద్రది నల్గొండ. చదువు విషయంలో ఆయన తండ్రి చాలా స్ట్రిక్ట్ అంట. అందుకు తగ్గట్టే సాగర్ బాగా చదివేవారట. ఎమ్సెట్లో 1535వ ర్యాంకు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని వాసవీ కాలేజీలో ఇంజినీరింగులో సీటు వచ్చింది. చదువయ్యాక స్టార్టప్ పెట్టాలనే ఆలోచనలో ఉండేవారట సాగర్ చంద్ర. బీటెక్ అయ్యాక మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లారు. అక్కడ యూనివర్సిటీలోనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఉండేదిట. అక్కడకొచ్చే వాళ్లని గమనించడం, మాట్లాడటం చేశాక… సినిమాలంటే ఆసక్తి పెరిగిందట. చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరాక… సినిమాటోగ్రఫీతోపాటు మరికొన్ని కోర్సుల్లోనూ శిక్షణ తీసుకున్నారు సాగర్ చంద్ర.
ఇంట్లో అక్క పెళ్లి అనేసరికి… మంచి అవకాశం అనుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి నల్గొండ వచ్చేశారట. అక్క పెళ్లి తరవాత… ఇంట్లో అసలు విషయం చెప్పారట. దీంతో ఇంట్లో వాళ్లకు చాలా కోపం వచ్చిందట. అయితే ఆ సమయంలోనే విదేశాల్లో చదువుకొని వచ్చిన రవిబాబు, శేఖర్ కమ్ముల, క్రిష్ లాంటి దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ నమ్మకంతో… తల్లిదండ్రులు అయిష్టంగా ఉన్నా హైదరాబాద్‌కి మకాం మార్చేశారట. ఫ్రెండ్ ద్వారా రవిబాబును కలిశారట. ‘అమరావతి’ సినిమాకు పని చేయడం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సాగర్ చంద్ర.
ఆ తర్వాత ఓ కథ రాసుకొని… ఓ స్నేహితుడి ద్వారా డాక్టర్ సుధాకర్‌ను కలిశారట. కథ నచ్చడంతో ₹2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ‘నువ్వే నా డైరెక్టర్‌వి, రేపట్నుంచే పనులు మొదలుపెడదాం’ అన్నారట. అలా సినిమా తీసినా… అందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఓ స్వామీజీకి దగ్గరగా ఉందని కోర్టులో కేసులు పెట్టారట. దాని కోసం కోర్టులకు తిరిగి ఆఖరికి 2012లో సినిమా రిలీజ్ చేశారు. ఆ తర్వాత నారా రోహిత్, శ్రీవిష్ణు పరిచయమయ్యారు. తరచూ కలుసుకొని మాట్లాడే క్రమంలో చాలా విషయాలు చర్చకు వచ్చేవట.
ఆ సమయంలోనే ‘మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్రొఫెషనల్ మీడియా అండ్ మీడియా మేనేజ్మెంట్’ కోర్సు చేయడానికి ఆయన చదువుకున్న యూనివర్సిటీ నుండి పిలుపొచ్చిందట. దాంతో వెళ్లి ఆ కోర్సు చదువుదామని నిర్ణయించుకున్నారట సాగర్ చంద్ర. కానీ దానికి శ్రీవిష్ణు ఒప్పుకోలేదు. ‘ఒకసారి వెళ్తే తిరిగి రాలేవు. మనం సినిమా చేద్దాం. కావాలంటే చేశాక వెళ్లు’ అన్నారట. అలా ఆగిపోయారట. అప్పుడు క్రికెట్ నేపథ్యంలో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ రాశారట.
నారా రోహిత్, శ్రీవిష్ణుతో కలిసి ఆ సినిమా చేస్తే… మంచి హిట్ అయ్యింది. స్పెషల్ జ్యూరీ విభాగంలో బెస్ట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కి నంది అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఆయనలో ఉత్సాహాన్ని నింపిందట, అలాగే ఇంట్లో వాళ్లకు కూడా నమ్మకం కలిగించిందట. ఆ సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా ఓకే అయినా అనుకోని పరిస్థితుల్లో వర్కవుట్ కాక ముందుకెళ్లలేదట. ఈ సమయంలో ఓ రోజు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ చూసి కలవమన్నారట. దాని తర్వాత వెళ్తే ఈ సినిమాకు నువ్వే దర్శకుడివి అన్నారట. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసిందే. ఇప్పుడు చూస్తున్నదే.