ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ కోసం పరీక్ష రాసిన సాయిపల్లవి!
September 2, 2020 / 11:19 AM IST
|Follow Us
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొంతమంది నటీనటులు చెబుతారు. సాయి పల్లవి అలా కాదు. ఆమె డాక్టర్. యాక్టర్ అనేది ప్రేక్షకులకు తెలిసిన విషయమే. తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేయడానికి ముందే మలయాళంలో సినిమాలు చేసింది. అక్కడ ఆమె నటించిన ‘ప్రేమమ్’ పెద్ద హిట్. ఆ సినిమా చేసే టైమ్‌కి ఆమె మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేయలేదు. ఓ వైవు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు జార్జియాలో ఎంబిబిఎస్ చేసింది. ఆల్రెడీ మంచి మార్కులతో పాస్ అయిన సాయి పల్లవి, మరోసారి మెడిసిన్ ఎగ్జామ్ రాసింది. ఇండియాలో నియమ నిబంధనలే అందుకు కారణం.
విదేశాల్లో వైద్యవృత్తిని అభ్యసించిన వాళ్ళు, మన భారతదేశంలో మెడికల్ ప్రాక్టీస్ నిర్వహించాలన్నా, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా… ఇండియన్ మెడికల్ బోర్డ్ నిర్వహించే పరీక్ష రాసి పాస్ కావాల్సిందే. సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చేశారు కాబట్టి, మంగళవారం తిరుచ్చిలో ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ (ఎఫ్ఎమ్ఈజీ) పరీక్ష రాశారు.
ముఖానికి మాస్క్ ధరించి ఎగ్జామ్ హాల్ ఎక్కడని ప్రశ్నిస్తూ వెళ్లిన సాయి పల్లవి వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. సినిమాల కోసం చదువును నిర్లక్ష్యం చేయని ఆమెను అభిమానులు సహా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. చదువు కోసం సాయి పల్లవి కొన్ని సినిమాలను, కోట్ల రూపాయల పారితోషికాన్ని వదులుకున్న సందర్భాలు ఉన్నాయి.