Sai Pallavi: సాయిపల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?
June 13, 2022 / 11:55 PM IST
|Follow Us
పాత్ర ఎలాంటిదైనా.. ఆమె చేతిలో పడితే ఫుల్ జోష్‌గా కనిపిస్తుంది. కారణం ఆమె యాటిట్యూడ్, నటన, స్క్రీన్ ప్రజెన్స్ అంటుంటారు సినీ పెద్దలు. ఆమెనే తెలుగు ప్రేక్షకులు లేటెస్ట్ భానుమతి సాయిపల్లవి. హైబ్రీడ్ పిల్ల భానుమతిగా ప్రేక్షకుల మదిలో తిష్ట వేసిన సాయిపల్లవి త్వరలో ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటోంది, ఆమె ఇష్టాయిష్టాలు ఏంటి, అసలు ఎన్ని భాషలు ఆమెకు వచ్చు లాంటి ఆసక్తికర వివరాలు మీ కోసం.
సాయిపల్లవి ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా థియేటర్లో చూసి, బయటకు వస్తు మీడియా కెమెరాల కంటపడింది. దీంతో ‘సాయిపల్లవి మహేష్ ఫ్యాన్’ అంటూ తెగ రాసుకొచ్చారు. నిజానికి సాయిపల్లవికి థియేటర్లో సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టమట. బుర్ఖా వేసుకుని లేదంటే స్కార్ఫ్ కట్టుకునో థియేటర్‌కి వెళ్లి జనాల మధ్యలో కూర్చుని సినిమాల్ని చూసి ఎంజాయ్ చేస్తుంటుంది అట సాయిపల్లవి. అలా ఈ మధ్య ‘సర్కారు వారి పాట’ చూశా అని చెప్పింది సాయిపల్లవి.
ఇక ఈ చిన్న కెరీర్లో చాలా సినిమాలు చేశారు. అందులోనూ దేనికదే విభిన్నమైన పాత్ర. అయితే మరి ఆమెకు ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలని ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. సాయిపల్లవికి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి పౌరాణిక సినిమాల్లో నటించాలని కోరిక అట. అలాగే రన్నింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. ఆ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉందట. ఈ లెక్కన రన్నింగ్ అథ్లెట్స్ కథతో సాయిపల్లవి దగ్గరకు ఎవరైనా వెళ్తే ఇన్స్టంట్ యస్ అనే ఆన్సర్ దొరికేస్తుంది.
‘విరాటపర్వం’లో ఓ రోజంతా సాయిపల్లవి ఏమీ తినకుండా నటించింది అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పారు. దాని గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘విరాట పర్వం’లో ఓ సన్నివేశంలో కళ్లు లోపలికెళ్లిపోయి, ముఖం పీక్కుపోయినట్టు కనిపించాల్సి వచ్చిందట. దీంతో ఆ సీన్ సహజంగా రావాలని ఒక రోజంతా ఆహారం, నీళ్లూ తీసుకోవడం మానేసిందట సాయిపల్లవి.