మయోసైటిస్ రుగ్మత వచ్చాక సమంతలో (Samantha) హెల్త్ కాన్సియస్ పెరిగింది. తనకు వచ్చిన సమస్య గురించి, అలాంటి మరికొన్ని ఇబ్బందుల గురించి.. తనకు తెలిసిన విషయాలను ఓ పాడ్ కాస్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం స్టార్ట్ చేసింది. దీని కోసం కొంతమంది వైద్య నిపుణులతో మాట్లాడింది, మాట్లాడించింది కూడా. అయితే ఇటీవల తన పాడ్ కాస్ట్లో కొన్ని విషయాల గురించి చెప్పినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎపిసోడ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంది.
ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో డాక్టర్ / న్యూట్రిషనిస్ట్ / సైకాలజిస్ట్‌తో మాట్లాడి ఆ వివరాలు జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి ఆమె పెట్టిన పోస్ట్ మీద లివర్ డాక్ (ట్విటర్ హ్యాండిల్) అనే వ్యక్తి తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి. ఫైనల్‌గా ఆ విషయం సమసిపోయింది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో ఆ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడింది.
ఈ వారం ఒక ఆయుర్వేద డాక్టరుతో పాడ్ కాస్ట్ నిర్వహించింది. డాక్టర్ డేవిడ్ జాకర్స్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెడిసిన్‌కి ప్రత్యామ్నాయం గురించి ప్రస్తావన వచ్చింది. ఈ వీడియోకి సమంత ఒక ‘గమనిక’ పెట్టింది. ‘‘ఈ వీడియో, అందులోని సమాచారం కేవలం మీ అవగాహన, సమాచారం కోసం మాత్రమే. వీటిని పాటించేముందు మీరు మీ వైద్యుణ్ని సంప్రదించండి’’ అని చెప్పింది.
సమంత పాడ్ కాస్ట్లో ఇలా చెప్పారు, అలా చెప్పారు అనే ఉద్దేశంతో వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి అని కూడా సమంత ఆ గమనికలో రాసుకొచ్చింది. దీంతో గతంలో కాంట్రవర్సీ కావడంతో సమంత జాగ్రత్తపడింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే సమంతకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇన్నాళ్లకు అర్థమైంది అని మరికొందు కామెంట్లు చేస్తున్నారు.