పెళ్ళైన హీరోయిన్లు నటించకూడదు అనే మైండ్ సెట్ మారాలి – సమంత అక్కినేని
April 10, 2018 / 05:29 AM IST
చందబోస్ గారు ఎవర్ని ఊహించుకొని రాశారో తెలియదు కానీ.. ‘రంగస్థలం‘ సినిమాలో సమంతని చూస్తున్నంతసేపు ప్రేక్షకులందరూ మనసులో “ఎంత సక్కగా ఉంది” అనుకొన్నారు. ఒక పల్లెటూరి పడుచుగా పాత్రలో సమంత పరకాయ ప్రవేశం చేసిన విధానానికి శభాష్ అనకుండా ఎవరూ థియేటర్ ను వీడలేదు. “ఏమాయ చేసావె”లో జెస్సీ పాత్ర అనంతరం సమంతకి ఆస్థాయి గుర్తింపు, పేరు తీసుకొచ్చిన చిత్రం “రంగస్థలం”. సినిమా విడుదల టైమ్ లో తన భర్త నాగచైతన్యతో హనీమూన్ ట్రిప్ లో బిజీగా ఉన్న సమంత ఇవాళ “రంగస్థలం” సినిమా సక్సెస్ గురించి, తన పాత్రకి లభిస్తున్న ప్రశంసల గురించి పాత్రికేయలతో ముచ్చటించింది.
ఇంతటి విజయాన్ని మాత్రం ఊహించలేదు..
“రంగస్థలం” ఒక మంచి సినిమా అవుతుందని ముందే ఊహించాను కానీ.. మరీ ఈస్థాయిలో ఘన విజయం సాధిస్తుందని మాత్రం అనుకోలేదు. ఒక అయిదేళ్ళ క్రితం ఇదే సినిమా విడుదలైతే ఈ స్థాయి విజయం లభించేది కాదేమో. ఆడియన్స్ మైండ్ సెట్ మారిందని, ఇప్పుడు కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పుకోవచ్చు.
నాకొక మంచి ఛాలెంజ్
నేను ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పల్లెటూరికి వెళ్లలేదు. నాక్కూడా సుకుమార్ గారు కథ చెప్పినప్పుడు “రామలక్ష్మి” పాత్రకి న్యాయం చేయగలనా అని భయమేసింది. కానీ.. సుకుమార్ నా నుంచి మంచి నటన రాబట్టుకొన్నారు. ముఖ్యంగా నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం, అందుకే డిఫరెంట్ రోల్స్ టేకప్ చేశాను. అసలు నా మూతి, నా మొహం అంతగా తిరుగుతుందని నాకే తెలియదు. ప్రతి షాట్ తీస్తున్నప్పుడు సుకుమార్ “సమంత నువ్ అగ్లీగా చేయాలి” అనేవారు. ఇదేంటి ఆయన అలా అంటున్నారు అనుకొనేదాన్ని. గౌతమ్ మీనన్ గారు నాకు నటన పరంగా నేర్పింది వేరు.. సుకుమార్ నానుంచి రాబట్టుకుంది వేరు.
“ఏయ్ ఎంటిది” అనేశాడు చైతూ..
చైతూకి “రంగస్థలం” గురించి ఎప్పుడూ ఎలాంటి డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక చైతూ చూసి “ఏయ్ ఏంటిది?” అని షాక్ అయ్యాడు. ఇక సినిమా చూసిన తర్వాత చాలా మురిసిపోయాడు.
చరణ్ చాలా కేరింగ్ కోస్టార్..
చరణ్ తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి. అయితే.. సమ్మర్ లో మాంచి వేడిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చరణ్ తన కంటే నన్ను ఎక్కువగా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక పెద్ద హీరో తిట్టించుకోవడం అనేది ఇప్పటివరకూ నేను చూడలేదు. కానీ.. ఈ సినిమాలో నేను చరణ్ ని తెగ తిట్టేదాన్ని కానీ చరణ్ “పర్లేదు ఇంకా తిట్టు” అనేవాడు.
నాకు స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేయలేదు..
నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను. కానీ.. మొదటిసారిగా నా క్యారెక్టర్ కి ఒక ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేయడం అనేది “రంగస్థలం”తోనే జరిగింది. అందుకు నేను చరణ్ కి స్పెషన్ థ్యాంక్స్ చెప్పాలి. తానే దగ్గరుండి మరీ నాకోసం ఒక ఫస్ట్ లుక్, టీజర్ చేయించాడు. ఒక కోస్టార్ అతను ఇచ్చే వేల్యూ గురించి ఇంతకు మించి ఏం చెప్పగలం.
కావాలనే ఆ టైమ్ లో హనీమూన్ కి వెళ్ళాను..
నేను పెళ్ళైన మూడు రోజులకే “రాజుగారి గది 2” ప్రమోషన్స్ లో పాలుపంచుకొన్నాను. ఆ తర్వాత కూడా షూటింగ్స్ లో బిజీ అయిపోయాను. కేవలం మార్చిలోనే దాదాపు 3 సినిమాలు పూర్తి చేశాను. కనీసం చైతూతో కలిసి హనీ మూన్ కి కూడా వెళ్లలేదు. అయితే.. నేను నా ప్రతి సినిమా విడుదలకు ముందు రోజు పడుకొనేదాన్ని కాదు.. రిజల్ట్ ఏమవుతుందో, నన్ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అని భయపడేదాన్ని. కానీ.. చైతూ నాకు ఒక విషయం నేర్పించాడు. “నీ బెస్ట్ వర్క్ నువ్వు ఇవ్వు.. రిజల్ట్ ఆడియన్స్ కి వదిలేయ్” అని. అందుకే “రంగస్థలం” విషయంలో ఆ ఫార్మాట్ ను ఫాలో అయ్యాను. సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ పూర్తి చేసి చైతూతో కలిసి అమెరికా వెళ్లిపోయాను. అక్కడ ఉండే చైతూతో కలిసి “రంగస్థలం” సక్సెస్ ని ఎంజాయ్ చేశాను.
“ఈగ” కోసం ఆ రెండు పెద్ద సినిమాలు వదిలేసుకొన్నాను..
అప్పటికి వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న నాకు రాజమౌళి గారు “ఈగ” సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. “ఈగ” మొదట్లో చాలా చిన్న సినిమాగా మొదలెట్టారు. అదే టైమ్ లో మరో రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. “ఈగ”కి వచ్చే రెమ్యూనరేషన్ కి మూడింతలు ఆ సినిమాలకు ఆఫర్ చేశారు. కానీ.. నేను నటిగా ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో ఆ రెండు సినిమాలూ వదిలేసుకొన్నాను. అయితే.. “ఈగ” సూపర్ హిట్ అయ్యాక నటిగా నా పరిమితిని పెంచింది. ఎవరి సినిమాలైతే వదిలేసుకున్నానో వారితోనే అనంతరం రెండేసి సినిమాల్లో నటించాను.
మాటలతో కాదు చేతలతో ప్రూవ్ చేస్తాను..
“సమంతకి పెళ్లి అయిపోయింది కాబట్టి నేను ఆమె సినిమా చూడను” అని ఎవరూ అనుకోరు. కానీ కొందరు దర్శకులు, నిర్మాతలు మాత్రమే “పెళ్లి అయ్యింది కాబట్టి ఆవిడ ఈ సినిమా చేయదేమో” అనుకొనేవారు. అయితే.. “రంగస్థలం” చిత్రంతో నేను బ్యారియర్ బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా మాటలతో కాకుండా నా సినిమాలతో “పెళ్ళైన తర్వాత కూడా హీరోయిన్లు అన్నీ రకాల సినిమాలు చేయొచ్చు” అని ప్రూవ్ చేస్తాను.
కథతో పనిలేని పాత్రలు మాత్రం చేయను..
ఇంతకుమునుపు నేను నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం కోసం కొన్ని నచ్చని సినిమాల్లో కూడా నటించాను. అయితే.. ఇకపై మాత్రం కథకు అవసరం లేకుండా ఏదో గ్లామరస్ రోల్ లో నటించాలి అంటే మాత్రం నేను అస్సలు చేయను. అయితే.. ఈ మార్పు పెళ్లి వల్ల వచ్చింది కాదు. ఒక నటిగా నేను ఎదిగినప్పుడు నా పాత్రల ఔన్నిత్యం కూడా పెరగాలనే భావనతో తీసుకొన్న నిర్ణయం.
మళ్ళీ రామలక్ష్మిగా మాత్రం నటించను..
ఒకవేళ “రంగస్థలం” సినిమాని మళ్ళీ వేరే భాషలో అయినా రీమేక్ చేస్తే పొరపాటున కూడా నేను ఆ సినిమాలో నటించను. ఎందుకంటే “రామలక్ష్మి” అనే పాత్ర ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ ను నేను మళ్ళీ రిపీట్ చేయలేను. నాకు లేడీస్ సైకిల్ తొక్కడం వచ్చు కానీ.. మగాళ్ల సైకిల్ తొక్కడం సరిగా రాదు. కానీ.. సినిమాలో ఆ సైకిల్ తోక్కే సీన్ లో “పడిపోయినా పర్వాలేదు వెనక నుంచి తోసేయండి అని చెప్పేదాన్ని” (నవ్వుతూ).
అక్కినేని అమ్మాయిని.. ఆదివారం పనిచేయను
పెళ్ళికి ముందు మనం ఎంత లాంగ్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్ చేసినా పెద్దగా తేడా అనిపించేది కాదు. పెళ్లి తర్వాత చైతూ అనేవాడు “బాగా బిజీ అయిపోతున్నావ్” అని. అందుకే పెళ్లి తర్వాత సండే వర్క్ చేయడం మానేశాను. ఇప్పుడు నేను అక్కినేని అమ్మాయిని ఆదివారం మాత్రం అస్సలు పనిచేయను.
అనసూయకి ముందే చెప్పాను..
నా కాంబినేషన్ లో అనసూయకి రెండు సీన్స్ ఉన్నాయి. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అనసూయ పదే పదే అడుగుతూనే ఉండేది “బాగానే చేశానా” అని. నేను చెప్పేదాన్ని “ఈ సినిమా నీకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది” అని. అయితే.. సినిమా రిలీజ్ అయ్యేవరకూ అనసూయకి నమ్మకం లేదు. ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.
దగ్గరుండి మరీ డబ్బింగ్ చెప్పించుకొన్నాను..
‘రామలక్ష్మి” పాత్రకి ముందు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ పాత్రను నేను అంతగా ప్రేమించాను. అయితే.. ఆ యాస నేను సరిగా పలకలేకపోయాను. జ్యోతి డబ్బింగ్ చెబుతున్నప్పుడు దగ్గరుండి మరీ చూసుకునేదాన్ని. అందుకు కారణం ఆమె డబ్బింగ్ చెప్పగలుగుతుంది కానీ.. నా ఎమోషన్ ను తన వాయిస్ లో ఎలివేట్ చేయగలుగుతుందా లేదా అనే అనుమానం ఉండేది. అందుకే ఆమె డబ్బింగ్ చెబుతున్నప్పుడు నేను కూడా అక్కడే ఉండి ప్రతి ఒక్క డైలాగ్ లోనూ ఎమోషన్ సరిగ్గా వస్తుందా లేదా అని చూసుకునేదాన్ని.
ఇప్పటివరకూ నేను ఎవరికీ అలా మెసేజ్ పెట్టలేదు..
నేను ఇప్పటివరకూ నాకు ఫలానా పాత్ర కావాలి, నన్ను ఫలానా సినిమాలో హీరోయిన్ గా తీసుకోండి అని ఎవరినీ ఎప్పుడూ రిక్వెస్ట్ చేయలేదు. అలాగే.. “నన్ను ఈ సినిమాలో సెలక్ట్ చేయండి” అని ఏ దర్శకుడికీ మెసేజ్ చేయలేదు. ఇప్పటివరకూ పాత్రలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి.
చరణ్ తో లిప్ లాక్ చేయలేదు..
నిజానికి “రంగస్థలం” సినిమాలో నేను రామ్ చరణ్ ని ఆ సీన్ లో ముద్దు పెట్టుకోలేదు. అది కెమెరా ట్రిక్. అయితే.. ఒకవేళ ఆ సీన్ కి ఆ ఎమోషన్ అవసరం అనుకుంటే నిజంగా చరణ్ కి ముద్దు పెట్టడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది పడేదాన్ని కాదు. ఎందుకంటే.. ఆ సన్నివేశంలో ఒక చెవిటివాడికి అతడ్ని ఘాడంగా ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమను వ్యక్తపరిచే సందర్భం అది. సుకుమార్ ఎంతో అద్భుతంగా రాశారు ఆ సన్నివేశాన్ని.