“రంగస్థలం”, “మహానటి” సినిమాల విజయాలతో ఆనందంలో ఉన్న సమంతకి ఇబ్బంది ఎదురైంది. తాను విశాల్ సరసన నటించిన “ఇరుంబుతురై” ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది. మే 11 న రిలీజ్ అయిన ఇందులో సమంత సైక్రియాట్రిస్టు రతీదేవి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఇంతలోనే చిక్కువచ్చి పడింది. తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం ప్రదర్శించకుండా నిలిపివేశారు. విశాల్ ఇంటికి పోలీసు భద్రత కల్పించారు. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే.. ప్రజలకు సంబంధించిన వివరాలను వివిధ రకాలుగా సేకరించే ప్రభుత్వ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి ఎలా దుర్వినియోగమవుతోందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇందులో జీఎస్టీ.. ఆధార్ కార్డు లాంటి వాటిని నెగటివ్ గా చూపించడంతో వివాదం తలెత్తింది. సెన్సార్ సభ్యులు ఇందులోని కొన్ని సన్నివేశాలపై కట్ చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ విశాల్ టీం మాత్రం వాటిని తొలగించకుండానే సినిమాను రిలీజ్ చేసేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాలోని సన్నివేశాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై కోలీవుడ్ లో చర్చ సాగుతోంది. ఇప్పుడు విశాల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.