Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ రేట్లు మండిపోతున్నాయ్.. ఇలా అయితే..!
April 12, 2023 / 07:55 PM IST
|Follow Us
తెలుగు సినిమా టికెట్ రేట్లు.. గత కొంతకాలంగా వీటి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సంక్రాంతి సమయంలో ఈ టాక్ వినిపించే అవకాశం ఉందని కొందరు అనుకున్నా.. పెద్ద సినిమాలు మాత్రమే రావడంతో.. ఎవరూ ఏమీ అనుకోలేదు. అయితే ఇప్పుడు టికెట్ రేట్ల గురించి చర్చ మొదలైంది. దానికి కారణం ‘శాకుంతలం.’ అవును సమంత సినిమాతోనే ఈ చర్చ మళ్లీ మొదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రమిది. ఈ నెల 14న విడుదల చేస్తున్నారు.
సమంత తన కెరీర్లో అతి పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతోంది. దేశంలోనే అతి పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా పేరు గాంచింది. అనేక వాయిదాలు, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ శుక్రవారం ‘శాకుంతలం’ థియేటర్లలోకి విచ్చేస్తోంది. సమంత స్టార్ డమ్‌ను నమ్మి గుణశేఖర్, దిల్ రాజు ఈ సినిమా సిద్ధం చేశారు, రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే ఎక్కడా రాజీ లేకుండా సినిమాను నిర్మించారని అర్థమవుతోంది.
అయితే థియేటర్లకు అంతే ఉత్సాహంతో వస్తారా అనే చర్చ మాత్రం కనిపిస్తోంది. దానికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లు. స్టార్ హీరోల సినిమాలకు పెట్టినట్లుగా భారీ ధరలతో టికెట్లను అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో చూసుకుంటే మల్టీప్లెక్స్‌లో త్రీడీలో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్‌కు రూ. 400 వరకు చెల్లించాల్సి వస్తోంది. సింగిల్ స్క్రీన్లలో రేటు రూ.195గా పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతోనే ఇబ్బంది అని అంటున్నారు.
సినిమాకు (Shaakuntalam) అనుకున్న స్థాయిలో హైప్ లేదని ఓవైపు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇంత రేటు పెడితే.. టికెట్లు ఎలా తెగుతాయి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే సాధారణ ధరలకే టికెట్టు అంటూ ఆ మధ్య ప్రచారం చేసి మరీ జనాల్ని థియేటర్లకు రప్పించారు. ఇప్పుడు అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మళ్లీ ఇంత ధరలు పెడితే ఇబ్బందే. అయితే సినిమా బాగుంటే మౌత్ టాక్‌తో ఈ ధర అనే కాన్సెప్ట్ పక్కకు వెళ్లిపోతుంది అని చెప్పొచ్చు.