Chiranjeevi, Ram Charan: ‘రంగస్థలం’ సమస్య ‘ఆచార్య’కి వచ్చిందట!
March 24, 2022 / 09:57 AM IST
|Follow Us
మూడు గంటల సినిమా… ఒకప్పుడు ఇది పెద్ద విషయం కాదు కానీ, ఇప్పుడు మాత్రం చాలా పెద్ద విషయం. కారణం అంతా రెండు గంటలు, రెండు గంటల 15 నిమిషాల సినిమాలే చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో మూడు గంటల సినిమా అంటే చాలా పెద్ద ప్రయోగమే అని చెప్పాలి. ఇప్పుడు ఆ పని చిరంజీవి చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఫైనల్ డెసిషన్ ఇప్పుడు చిరంజీవి చేతుల్లోనే ఉంది అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?
‘ఆచార్య’ సినిమా పూర్తయి, అంతా సిద్ధమై చాలా రోజులు అయిపోయింది. ఫిబ్రవరిలో రిలీజ్ అనేసరికి, దర్శకుడు కొరటాల శివ సినిమాకు తుది మెరుగులు దిద్ది పక్కనపెట్టారు. అయితే ఏమైందో ఏమో సినిమా రన్ టైమ్ మీద చిన్నపాటి డౌట్ మొదలైందట టీమ్‌లో. దీంతో ఏం చేద్దాం అనే చర్చ మొదలైందట. ఇప్పుడు సినిమా నిడివి ఏకంగా మూడు గంటలు దాటిపోయిందని కూడా అంటున్నారు. దీంతో చిరంజీవి ఏమంటారు అనే దగ్గర చర్చ ఆగిందట.
పెద్ద సినిమాలకు అంటే నిడివి ఎక్కువున్న సినిమాలకు ప్రేక్షకుల నుండి అంత ఆశాజనకమైన ఆదరణ ఉండటం లేదు. సినిమా తొలి షో పడగానే.. నిడివి తక్కువ ఉంటే బాగుండు అని సగటు ప్రేక్షకుడు కూడా చెప్పేస్తున్నాడు. గతంలో ‘రంగస్థలం’ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సినిమా నిడివి ఎక్కువవుతుందా? అనే ప్రశ్న దర్శకుడు సుకుమార్ మైండ్లోకి రాగానే చిరంజీవిని కాంటాక్ట్ అయ్యారని అంటారు. ఆ రోజు చిరు… ‘ఇంత నిడివితోనే సినిమా రిలీజ్ చచేసేయండి’ అని భరోసా ఇచ్చారట. ప్రేక్షకులు ఆదరించారు కూడా.
అయితే ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో చిరంజీవి ఆ మాట మీదే ఉంటారో, లేక నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తారో అనేది చూడాలి. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమా నిడివి ఓ 15 నిమిషాలు తగ్గిస్తే బాగుండు అనే సూచనలు వినిపిస్తున్నాయట చిత్రబృందానికి. మరి ఈ చర్చ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. విషయం ఉంటే ఎంత నిడివి ఉన్నా సినిమా చూస్తారు అనే పాయింట్ ఇక్కడ మరచిపోకూడదు బాస్.