Sapta Sagaralu Dhaati Review in Telugu: సప్త సాగరాలు దాటి సినిమా రివ్యూ & రేటింగ్!
September 22, 2023 / 04:50 PM IST
|Follow Us
Cast & Crew
రక్షిత్ శెట్టి (Hero)
రుక్మిణీ వసంత్ (Heroine)
అచ్యుత్ కుమార్, పవిత్ర లోకేష్ తదితరులు.. (Cast)
హేమంత్ ఎం.రావ్ (Director)
రక్షిత్ శెట్టి (Producer)
చరణ్ రాజ్ (Music)
అద్వైత గురుమూర్తి (Cinematography)
కన్నడ చిత్రసీమ నుండి వచ్చి సంచలనం సృష్టిస్తున్న తాజా చిత్రం “సప్తసాగరదాచే ఎల్లో”. రక్షిత్ శెట్టి హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి “కావలుదారి” ఫేమ్ హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహించారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న కన్నడ భాషలో విడుదలై అందరి మన్ననలు అందుకొంది. సినిమాకి అన్నీ భాషల ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో అనువాద రూపంలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. మన తెలుగు ఆడియన్స్ ను ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!!
కథ: మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) కొన్నేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొంటారు. ఓ గొప్ప ఇంట్లో డ్రైవర్ గా వర్క్ చేస్తుంటాడు మను, కాలేజ్ లో చదువుకుంటూ.. మంచి గాయని అవ్వడం కోసం ప్రాక్టీస్ చేస్తుంటుంది ప్రియ. సరదాగా పాటలు, ప్రయాణాలతో సజావుగా సాగుతున్న వీరి జీవితం.. మను డబ్బు కోసం చేసిన ఒక పని కారణంగా చెల్లాచెదురవుతుంది.
మను చేసిన ఆ తప్పేమిటి? మనుని రక్షించడం కోసం ప్రియ ఏం చేసింది? వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటయ్యారా? అనేది “సప్తసాగరాలు దాటి” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: రక్షిత్ శెట్టి మంచి నటుడన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రుక్మిణీ వసంత్ అతడ్ని పూర్తిగా డామినేట్ చేసింది. రక్షిత్ పడే బాధ, తపన కూడా రుక్మిణీ కళ్ళల్లోనే కనిపిస్తాయి. ఒక స్వచ్చమైన ప్రేమికురాలు ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటే బాగుంటుంది అని సినిమా చూసే ప్రతి యువకుడు అనుకుంటాడు. అంత స్వచ్ఛంగా ఉంటుందామె పాత్ర. అలాగే.. రక్షిత్ శెట్టి కళ్ళల్లోని బాధను ప్రేక్షకును అనుభూతి చెందుతాడు. ఓ సగటు ప్రేమికుడిగా అతడి హావభావాలు మనసుకి హత్తుకుంటాయి.
ఒంటరి తల్లి పాత్రలో పవిత్ర లోకేష్, నెగిటివ్ రోల్లో అచ్యుత్ కుమార్ అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: పేపర్ మీద రాసుకుంటే చాలా సాధారణమైన ఈ కథను దర్శకుడు హేమంత్ రావు ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం ప్రశంసనీయం. ప్రతి పాత్ర నుంచి అద్భుతమైన ఎమోషన్ ను పండించాడు దర్శకుడు. సినిమాలోని ప్రతి పాత్ర జస్టిఫికేషన్ కోసం పరితపిస్తుంటుంది. ప్రతి ఒక్కరూ తాము చేసిన తప్పుకు పరిహారం కోసం వెతుకుతుంటారు. క్యారెక్టర్ ఆర్క్స్ మీద ఎంతో వర్క్ చేస్తే కానీ.. ఈ తరహా క్యారెక్టరైజేషన్స్ వర్కవుటవ్వవు. అందుకోసం హేమంత్ రావును మెచ్చుకొని తీరాలి.
అలాగే.. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి పనితనం గురించి మాట్లాడుకోవాలి. ఓ చేనేత కార్మికుడు వస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా అల్లుతాడో.. సినిమాలోని ప్రతి ఒక్క ఫ్రేమ్ ను అంతే అందంగా కంపోజ్ చేసుకున్నాడు అద్వైత గురుమూర్తి. ముఖ్యంగా సినిమా మొత్తం బ్లూ కలర్ తో నింపి.. బాధ, ఆనందం అనే ఎమోషన్స్ కు తగ్గట్లు.. లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకున్న విధానం అతడు కథను, కథలోని ఎమోషన్స్ ను ఎంత బాగా అర్ధం చేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
సంగీత దర్శకుడు చరణ్ రాజ్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. పాటలతోనే కాక నేపధ్య సంగీతంతోనూ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి తగ్గట్లుగా ఉంది. ఎక్కడా రాజీపడలేదు అని స్పష్టమవుతుంది.
విశ్లేషణ: కొన్ని ప్రేమకథలు సంతోషాన్ని, ఇంకొన్ని సంతృప్తిని కలిగిస్తాయి. కానీ.. అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకుల గుండెలకు హత్తుకొని.. బాధకు మించిన అగాధంలోకి తీసుకెళతాయి. “నిరీక్షణ (1986)” తర్వాత ఆస్థాయిలో ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోయి పిండేసిన స్వచ్చమైన ప్రేమకథ ఇదే. ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.