అత్తారింటికి దారేది, గోపాల గోపాల వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించడంతోపాటు.. స్వయంగా కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్”. పవన్ కళ్యాణ్ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన ఈ చిత్రాన్ని ఆయన మిత్రుడు శరత్ మరార్ మరియు ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ కథానాయకి కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి.. “పవర్”తో దర్శకుడిగా మారిన రచయిత బాబీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. తెలుగు వారికి అత్యంత శ్రేష్టమైన “ఉగాది” పర్వదినాన (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సర్దార్ గబ్బర్ సింగ్” వారిని ఏమేరకు ఆకట్టుకొన్నాడో తెలుసుకోవాలంటే.. “ఫిల్మీ ఫోకస్” అందిస్తున్న ఈ ఎక్స్ క్లూజివ్ రివ్యూను చదవాల్సిందే..!!
కథ:
ఆంధ్ర-తెలంగాణ మరియు ఛత్తీస్ గడ్ బోర్డర్లకు సరిగ్గా మధ్యలో ఉన్న గ్రామం “రత్తన్ పూర్”. ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్) అనే రాజవంశీకుడి ఆధీనంలో ఉంటుందా గ్రామం. తనకు ఇష్టం వచ్చినట్లుగా ఊరిని, ఊర్లో ఉండే ప్రజల్ని అష్టకష్టాలకు గురి చేస్తుంటాడు. అతని ఆట కట్టించడం కోసం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్)ను హైద్రాబాద్ నుంచి రత్తన్ పూర్ కి ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు హరి నారాయణ్ (ముఖేష్ రుషి). మరి హైద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రాన్స్ ఫర్ మీద రత్తన్ పూర్ కి వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్.. ప్రజలతోపాటు భూమాత కడుపు సైతం కొడుతున్న భైరవ్ సింగ్ ను ఈ విధంగా ఎదిరించాడు? అనేది సినిమా కథాంశం!
విశ్లేషణ:
“గబ్బర్ సింగ్”లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వెండితెరపై వీరంగం ఆడిన పవన్ కళ్యాణ్.. “సర్దార్ గబ్బర్ సింగ్”లో మాత్రం ఓ కామెడీ పోలీస్ గా నటించడం, హీరోయిజాన్ని ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయకపోవడం గమనార్హం. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన పవన్ కళ్యాణ్.. మరో మారు తాను రచయితగా “జీరో” అని నిరూపించుకొన్నాడు. యువరాణి ఆరుషి పాత్రలో కాజల్ అగర్వాల్ అండంతోపాటు నటనతోనూ ఆకట్టుకోగలిగింది. సినిమా అర్ధం కాక విలవిల్లాడుతున్న ప్రేక్షకులకు కాస్తో కూస్తో ఆహ్లాదపరిచేది కాజల్ అందచందాలు మాత్రమే.
భైరవ్ సింగ్ అనే కర్కోటకమైన ప్రతినాయకుడి పాత్రను శరద్ కేల్కర్ పండించలేకపోయాడు. అతడి క్యారెక్టర్ లోని విలనిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు.
ముఖేష్ రుషి, టిస్కా చోప్రా, ఊర్వశి వంటి మంచి నటులను కేవలం తెరను నింపడానికి వాడుకోవడం.. బ్రహ్మానందం, అలీ వంటి సీనియర్ కామెడియన్ల చేత ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన విఫల ప్రయత్నాలు దర్శకుడు బాబీ మరియు కథకుడు పవన్ కళ్యాణ్ ల అసమర్ధతకు అద్ధం పడతాయి. ఇక మిగిలిన నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన బాణీలు ఓ మోస్తరుగా ఉన్నా.. సదరు పాటల ప్లేస్ మెంట్ సరిగా లేక ఒక్కటంటే ఒక్క పాటను ప్రేక్షకుడు సరిగా ఆస్వాదించలేడు. ముఖ్యంగా.. స్విట్జర్లాండ్ లో చిత్రీకరించిన రెండు డ్యూయెట్ సాంగ్స్ కొరియోగ్రఫీ.. “ఇది పవన్ కళ్యాణ్ సినిమాయేనా?” అనే సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడే కాక పవన్ కళ్యాణ్ వీరాభిమానులు సైతం తమను తాము ప్రశ్నించుకొనే స్థాయిలో ఉన్నాయి.
ఆర్ధర్ ఎ.విల్సన్ కెమెరా పనితనం బాగున్నప్పటికీ.. సినిమాలో పస లేని కారణంగా ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
“కృష్ణం వందే జగద్గురుం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గోపాల గోపాల” వంటి చిత్రాలు సాధించిన విజయాల్లో.. తనవైన సహజమైన సంభాషణలతో కీలకపాత్ర పోషించిన సాయిమాధవ్ బుర్రా సైతం ప్రాసల కోసం పాట్లు పడడం బాధాకరం.
సీనియర్ ఎడిటర్ అయిన గౌతమ్ రాజు.. తన కత్తెరను సానబెట్టి, సినిమాలో కనీసం 20 నిమిషాల అనవసరమైన సన్నివేశాలను ఎడిట్ చేసిన అవసరం చాలా ఉంది.
ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన పవన్ కళ్యాణ్.. అసలు ఏం అనుకోని ఈ కథ రాసుకొన్నాడు? హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలా ఎలివేట్ చేద్దామనుకొన్నాడు? ఫైనల్ గా సినిమాకు ఎటువంటి కన్ క్లూజన్ ఇద్దామనుకొన్నాడో అర్ధం కాక.. సగటు ప్రేక్షకుడు నేత్తీనోరు కొట్టుకోవడం ఖాయం.
పవన్ కళ్యాణ్ పేపర్ మీద రాసిచ్చిన సన్నివేశాన్ని కెమెరాలో బంధించడం మినహా.. దర్శకుడు బాబీ చేసిందేమీ లేదిక్కడ. చేయగలిగింది కూడా ఏమీ లేదనుకోండి. ఆ కారణంగా ప్రత్యేకించి దర్శకుడు బాబీ ప్రతిభ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఫిల్మీ ఫోకస్ ఎనాలసిస్:
పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు ప్రేమతో “పవర్ స్టార్” అని పిలుచుకొంటారు. అందుకే ఆయనతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు, ఆయన హీరోయిజాన్ని తారాస్థాయిలో పండించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాకి స్వయంగా కథ సమకూర్చుకొన్న పవన్ కళ్యాణ్.. తన క్యారెక్టరైజేషన్ ను తానే చాలా హేయంగా వ్రాసుకోవడం కడు శోచనీయం. విలన్ల ముందు కుప్పి గెంతులు వేయడం, ఫైట్లలో మినహా ఎక్కడా హీరోయిజం అనే పదానికి సైతం తావులేకుండా చేయడం వంటివి.. పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది.
ఫైనల్ పాయింట్: సహనం, ఓర్పు అవసరమైనదానికంటే ఎక్కువపాళ్ళు ఉండే పవన్ వీరాభిమానులు మాత్రమే కాస్త ఓపికతో ఒకసారి చూడదగిన చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్”