Seetimaarr, Love Story: ‘లవ్ స్టోరీ’ ఆ డేట్ కు కూడా కష్టమేనట..కారణం అదే..!
September 14, 2021 / 07:29 PM IST
|Follow Us
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎక్కువ సార్లు వాయిదా పడ్డ సినిమా ‘లవ్ స్టోరీ’ అనే చెప్పాలి. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ‘లవ్ స్టోరీ’ ఆడియో సూపర్ హిట్ అవ్వడం టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. నిజానికి ‘వకీల్ సాబ్’ విడుదలైన మరుసటి వారం ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో మళ్ళీ ఈ చిత్రాన్ని నిర్మాతలు వాయిదా వేయక తప్పలేదు. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం..
జనాలు మెల్ల మెల్లగా వస్తుండడం వంటివి ‘లవ్ స్టోరీ’ నిర్మాతల్ని రిలీజ్ వైపు అడుగులు వేసేలా చేసాయి. సెప్టెంబర్ 10 న రిలీజ్ అన్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ‘సీటీమార్’ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరీ’ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ రెండో రోజు నుండీ ‘సీటీమార్’ కలెక్షన్లు తగ్గాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ‘సీటీమార్’ మూవీకి కలెక్షన్లు రావడం లేదు. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా… 3 షోలు అదీ 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అవుతున్నప్పటికీ ఆంధ్రాలోనే మంచి కలెక్షన్లు వస్తున్నాయి ‘సీటిమార్’ మూవీకి.
అయితే వీకెండ్ ముగిసినప్పటికీ ‘సీటీమార్’ మూవీ 50శాతం కూడా రికవరీ సాధించలేదు. దాంతో ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు మళ్ళీ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. అసలే ‘లవ్ స్టోరీ’ కి రూ.20 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో రూ.10 కోట్ల లోపు బిజినెస్ సినిమాలే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. హిట్ అనిపించుకున్న సినిమాలు కూడా రూ.10 కోట్ల వసూళ్ళను రాబట్టలేదు. ‘సీటీమార్’ ఆ ఫీట్ ను అందుకుంటుందో లేదో ఈ వారం పూర్తయ్యేవరకు చెప్పలేము. మరో పక్క ఓవర్సీస్ లో 100 లొకేషన్లలో ఏ సినిమాని విడుదల చేయలేకపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు మళ్ళీ ఆలోచనలో పడ్డారట. కాబట్టి సెప్టెంబర్ 24 కి కూడా ‘లవ్ స్టోరీ’ కచ్చితంగా రిలీజ్ అవుతుంది అని చెప్పలేము అంటున్నారు విశ్లేషకులు.