సెప్టెంబరులో వచ్చే సినిమాలు చాలా కీలకం.. ఎందుకంటే?
August 17, 2022 / 12:40 PM IST
|Follow Us
విజయాలతో 2022ను ప్రారంభించినా.. ఆ తర్వాత సరైన విజయాలు రాక ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించింది టాలీవుడ్. అయితే ఆగస్టు నెల టాలీవుడ్‌కి మూడు మంచి సినిమాలు అందించింది. దీంతో రాబోయే నాలుగు నెలలు జాగ్రత్తగా ఉంటే.. గత రెండేళ్ల ఇబ్బందుల నుండి టాలీవుడ్ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఏయే సినిమాలు రావొచ్చు అనే విషయం ఆసక్తిగా మారింది. అందుకే సెప్టెంబరులో ఏయే సినిమాలు వస్తాయి అనేది ఓసారి చూద్దాం. పనిలోపనిగా వాటి విజయావకాశాలు కూడా చూద్దాం.
ఇందాక చెప్పినట్లు ఆగస్టులో టాలీవుడ్కిమూడు విజయాలు దక్కాయి. మొదటి వారంలో కల్యాణ్‌రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ రాగా, రెండో వారంలో నిఖిల్ ‘కార్తికేయ 2’ వచ్చింది. ఈ మూడూ మంచి వసూళ్లనే అందుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వరుసగా రెండు వారాలు వస్తున్నారు. ‘కార్తికేయ 2’ అయితే బాలీవుడ్‌లోనూ అదరగొడుతోంది. ఇక సెప్టెంబరు సంగతి చూస్తే.. తొలి వారం నుండే ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి.
చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ వస్తోంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోంది అని టాక్ ఉంది. అయితే సినిమాకు రీషూట్ల మచ్చ అయితే పడింది. ఇక ఆ తర్వాతి వారం కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ వస్తుంది. వరుసగా ఫ్లాప్‌ల మీదున్న కిరణ్‌కి ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి. సెప్టెంబర్ 9న శర్వానంద్ తమిళ – తెలుగు చిత్రం ‘ఒకే ఒక జీవితం’ వస్తోంది. శర్వా పరిస్థితి కూడా కిరణ్‌లాగే ఉంది.
ఆ రోజునే చాలా నెలలుగా ఆగిపోయిన సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ తీసుకొస్తున్నారు. మరి ముక్కోణపు పోటీలో విజయం సాధించేది ఎవరో చూడాలి. మూడో వారానికి వస్తే సుధీర్ బాబు, కృతి శెట్టి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వస్తుంది. ఈ సినిమా కూడా చాలా నెలలుగా ఆగిపోయింది. కృతికి ఈ మధ్య ఏదీ కలసి రావడం లేదు. మరి సుధీర్‌బాబు ఏమన్నా సాయం చేస్తాడేమో చూడాలి. రెజీనా, నివేథ థామస్ నటించిన ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న తీసుకొస్తారట.
నాలుగో వారంలో నాగశౌర్య ‘కృష్ణ వ్రిద విహారి’తో వస్తున్నాడు. అదే వారంలో శ్రీవిష్ణు ‘అల్లూరి’ కూడా వస్తోంది. ఈ ఇద్దరికీ సినిమా విజయం చాలా అవసరం. చిన్న సినిమాల సందడి పూర్తయ్యాక నెలాఖరులో మణిరత్నం పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ వస్తుంది. ఈ సినిమాకు తెలుగులో చిన్నపాటి నేటివిటీ ఇష్యూస్ ఉన్నాయి. అలా సెప్టెంబరులో సినిమాలు.. ఇండస్ట్రీకే కాదు, ఆయా టీమ్స్‌కి కూడా చాలా కీలకం.