Balakrishna: అందరికీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకేంద్రుడు.. బాలయ్యకి ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోయాడు..!
October 9, 2021 / 01:11 PM IST
|Follow Us
కే. రాఘవేంద్రరావు బీఏ… తెలుగు తెరకు కమర్షియల్ నడకను నేర్పిన దర్శకుడు. పౌరాణికాలు, జానపదాలు టాలీవుడ్‌ని ఏలుతున్న సమయంలో ఆరు పాటలు, కామెడీ, యాక్షన్ వంటి మాస్ ఎలిమెంట్స్‌తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన మేకర్. ఆయనతో ఏ హీరో జతకట్టినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎందరికో సూపర్హిట్లు అందించిన రాఘవేంద్రరావు.. ఒక్క హీరోను మాత్రం బాగా డిజప్పాయింట్ చేశారు. దాదాపు ఏడు సినిమాలు తీసినా.. ఏ ఒక్కటి హిట్ కొట్టలేదు. ఆయన ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన మొదటి సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’.. ఇందులో ఎన్టీ రామారావు, నందమూరి బాలకృష్ణ కలసి నటించారు. 1980లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత 1985లో వచ్చిన ‘పట్టాభిషేకం’ కూడా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. ఆ తర్వాత ‘అపూర్వ సహోదరులు’, ‘సాహస సామ్రాట్’ ‘దొంగరాముడు’. ఇలా ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమాని చేయడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు.
అయితే ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయిన అశ్వినీదత్ ‘అశ్వమేధం’ పేరిట భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రుల సోగ్గాడు శోభన్ బాబు కీలకపాత్రలో నటించారు. ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ వున్నా ఈ సినిమా కూడా ప్లాప్‌ని మూటగట్టుకుంది. ఆ తర్వాత దాదాపు 16 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావుతో జత కట్టారు బాలయ్య . అదే ‘పాండురంగడు’. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరక్కించారు. అయితే ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు రుచించలేదు. అలా బాలయ్య- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఏడు సినిమాలు అలా తేడా కొట్టేశాయి.