సందీప్ కిషన్-సుధీర్ బాబు-ఆది-నారా రోహిత్ హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్ “శమంతకమణి”. “భలే మంచి రోజు” ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. రాజేంద్రప్రసాద్ ఓ ముఖ్యపాత్ర పోషించిన ఈ కామెడీ థ్రిల్లర్ నేడు (జూలై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సమీక్ష మీకోసం..!!
కథ : “శమంతకమణి” అనే అయిదు కోట్ల విలువుగల కాస్ట్లీ కారు. కారు ఓనర్ కొడుకు కృష్ణ (సుధీర్ బాబు) బర్త్ డే పార్టీకి ఆ కారును తీసుకుని వెళ్తాడు. అదే పార్టీకి రకరకాల కారణాల వల్ల వెళ్ళిన శివ (సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), రంజిత్ కుమార్ (నారా రోహిత్), మహేష్ బాబు (రాజేంద్రప్రసాద్)లు శమంతకమణి కారు దొంగతనానికి బాధ్యులవుతారు. ఈ నలుగురిలో కారు దొంగతనం చేసింది ఎవరు? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఈ దొంగతనాన్ని ఎలా ఛేదించాడు? చివరికి కారు దొరికిందా లేదా? అనేది సినిమాలో కీలకాంశం.
నటీనటుల పనితీరు : ఆది-సందీప్ కిషన్-సుధీర్ బాబు వంటి యువ కథానాయకులందరూ పోటీపడి నటించినా.. రంజిత్ కుమార్ అనే పోలీస్ పాత్రలో నారా రోహిత్ మంచి వేరియేషన్స్ చూపించి అందర్నీ ఓవర్ టేక్ చేసి.. ఆడియన్స్ ను అలరించాడు. మిగతా హీరోలు కూడా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నప్పటికీ.. నారా రోహిత్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. అయితే.. ఎవరి పాత్రలో వారు పర్వాలేదనిపించుకొన్నారు.
రాజేంద్రప్రసాద్ తన కామెడీ టైమింగ్-స్క్రీన్ ప్రెజన్స్ తో విశేషంగా అలరించారు. ఇంద్రజ, చాందిని చౌదరి, అనన్యసోని వంటి భామలు నాలుగైదు సన్నివేశాలకు పరిమితమైపోయారు. చాలా కాలం తర్వాత సుమన్ కాస్త మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకోగా.. తనికెళ్లభరణి, హేమ లాంటి సీజన్డ్ ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. చాలా సన్నివేశాల్లో ఎమోషన్ వీక్ గా ఉన్నా.. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో దాన్ని బాగా ఎలివేట్ చేశాడు. ప్రత్యేకించి సినిమాలో పాటలు లేకపోవడం కూడా సినిమా ప్లస్ పాయింట్ గా నిలిచింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. పబ్ సీన్ విజువల్స్, క్యారెక్టర్ ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. కాకపోతే.. నైట్ ఎఫెక్ట్ షాట్స్ కి లైటింగ్ మరీ ఎక్కువవ్వడంతో.. సీన్ మూడ్ లోకి ఆడియన్ అంత ఈజీగా ఇన్వాల్వ్ అవ్వలేడు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ కథ తగ్గట్లుగా ఎక్కడా కూడా రాజీపడకుండా సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. లావిష్ గా తీశారు సినిమాని.
ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విషయానికొస్తే.. ఫస్ట్ సినిమా “భలే మంచి రోజు” కోసం ఫాలో అయిన “క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ” స్క్రీన్ ప్లేనే “శమంతకమణి”కి వాడాడు. అందువల్ల సెకండాఫ్ లో కాస్త క్లారిటీ వచ్చిందే కానీ.. ఫస్టాఫ్ మొత్తం నత్తనడక నడిచి.. ట్రైలర్ చూసి ఏదో ఎక్స్ ఫెక్ట్ చేసి సినిమాకి వచ్చే ఆడియన్ బోర్ ఫీలవుతాడు. దానికి తోడు నలుగురు హీరోల క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవడం మెయిన్ ప్లాట్ ను ఎలివేట్ చేయడానికి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ వెయిట్ చేయడం లాంటివి సినిమాకి మైనస్ లుగా చెప్పాలి. “శమంతకమణి” స్క్రీన్ ప్లే “బిరియాని, సరోజా” లాంటి సినిమాల్లో ఇదివరకే చూసేసి ఉండడం వల్ల సినిమా పెద్ద కొత్తగా అనిపించదు. కాకపోతే.. మన తెలుగు సినిమా యువ హీరోలు నలుగురు కలిసి నటించడం వల్ల కాస్త ఆకట్టుకొంటుంది. సినిమాని ఎలా ఎండ్ చేయాలో అర్ధం కాక.. చాలా చిన్న ట్విస్ట్ తో సినిమాని ముగించి.. రెగ్యులర్ “హ్యాపీ ఎండ్”ను డిజైన్ చేసేశాడు డైరెక్టర్. దాంతో.. వార్నీ ఇంతేనా అనిపిస్తుంది.
విశ్లేషణ : “శమంతకమణి” కొత్తదనం కరువైన పాత చింతకాయ పచ్చడి సినిమా. మేకింగ్ రిచ్ గా ఉంటే సరిపోద్ది అనుకొనే దర్శకులు కాస్త కథనంపై కూడా కాన్సన్ ట్రేట్ చేస్తే బాగుంటుంది. రాసుకొన్న కథే చాలా సింపుల్ అనుకొంటే.. ఇక స్క్రీన్ ప్లే కూడా ఒక రెండుమూడు సన్నివేశాలు తప్ప పెద్ద ఆశించే స్థాయిలో లేకపోవడం మైనస్ గా మారింది. ఓవరాల్ గా.. చెప్పాలంటే “శమంతకమణి” ఓ మోస్తరుగా అలరించే కామెడీ ఎంటర్ టైనర్.