శంకర్ – రామ్‌చరణ్ సినిమా మెయిన్ పాయింట్ పవన్‌దేనా?
January 10, 2023 / 01:05 PM IST
|Follow Us
పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌కి మెగా ఫ్యామిలీ సపోర్టు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ‘ప్రజారాజ్యం’ సమయంలో ఇదే చేశారు. ఇప్పుడు ‘జనసేన’ విషయంలోనూ చేస్తారు. అయితే ఎలా చేస్తారు అనేదే ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన కోసం పెద్దగా మెగా ఫ్యామిలీ బయటకు వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో వస్తారు అని కచ్చితంగా చెప్పొచ్చు. అది ఎలా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధాం వస్తోంది. సినిమాల ద్వారా మెగా ఫ్యామిలీ సపోర్టును స్టార్ట్ చేస్తారా? అవుననే అనిపిస్తోంది రామ్ చరణ్ రాబోయే సినిమా వివరాలు చూస్తుంటే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగుతూ, సాగుతూ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పాలిటిక్స్ లింక్ ఇప్పటికే బయటకు వచ్చింది. రాజమహేంద్రవరం నేపథ్యంలో సినిమా ఉంటుందని, సినిమా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అక్కడే ఉంటాయని ఇప్పటికే లీకుల ద్వారా వచ్చేసింది. అయితే ఆ సీన్స్‌లో పొలిటికల్ టచ్ బలంగా ఉంటుందట.
ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని లీక్డ్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీ పేరు, గుర్తులు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాలో ఆ పార్టీ నినాదం కూడా బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమా చరణ్‌కు, పవన్‌కు బాగా కలిసొచ్చేలా డిజైన్ చేశారు అని చెబుతున్నారు. ‘మనం ఓటు అమ్ముకుంటే, మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్ముకున్నట్లే’ అనేది ఈ సినిమాలో మెసేజ్ అట. మీకు గుర్తుండి ఉంటే.. జనసేన ఎన్నికల నినాదాల్లో ఇదొకటి.
రామ్‌చరణ్ సినిమా పోస్టర్లు చూస్తే.. జనసేన పార్టీ గుర్తులు, పేర్లకు దగ్గర పేర్లు కనిపిస్తున్నాయి.ఈ సినిమాలో చరణ్ పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. సింబల్‌గా టీమ్ రెండు పిడికిళ్లు కలిసిన చేతుల గుర్తు వాడారు. నిజ రాజకీయంలో చూస్తే.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ జనాల్లోకి బలంగా వెళ్లింది అంటే అది పిడికిలి గుర్తుతోనే. చెయ్యెత్తి బలంగా పిడికిలి చూపించే పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల ట్విటర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి.