టికెట్ రేటు పెంచితే ప్రేక్షకుడు థియేటర్ కి దూరమవుతాడు
March 8, 2021 / 04:58 PM IST
|Follow Us
ఒక సినిమాకి కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ప్రేక్షకుల ఆదరణ కూడా అంతే ముఖ్యం. ఈమధ్య నిర్మాతలకు ఆడియన్స్ కంటే కలెక్షన్స్ ఎక్కువ అయిపొయాయి. థియేటర్ కి ఎంతమంది వస్తారు అనే విషయాన్ని అసలు పట్టించుకోవడం మానేశారు. పెట్టిన డబ్బులు మొదటి వారాంతంలో వస్తున్నాయా లేదా అనే విషయాన్ని మాత్రమే సక్సెస్ కి కొలమానంగా చూస్తున్నారు. అందుకే టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాస్త పెద్ద హీరోల సినిమాలకు పెంచారంటే అర్ధం చేసుకోవచ్చు.
కానీ లో బడ్జెట్ సినిమాలకి కూడా టికెట్ రేట్స్ పెంచడం అనేది సినిమాకి వచ్చే ప్రేక్షకులను ఇండైరెక్ట్ గా రావొద్దని చెప్పడమే. ఇప్పుడు శ్రీకారం టీమ్ చేస్తున్న పని అలాగే ఉంది. ఈ సినిమాకి 50 రూపాయల రేటు పెంచారు. అసలే సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఎదో ఒక ఓటీటీలో సినిమా వచ్చేస్తుండడంతో థియేటర్లకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు ఇలా ప్రతి సినిమాకి టికెట్ ధర పెంచుకుంటూ పోవడం అనేది ఎంత వరకు సమంజసం అనేది నిర్మాతలకే తెలియాలి.
మరీ ముఖ్యంగా శర్వా లాంటి యువ హీరో సినిమాకి టికెట్ రేట్ పెంచడం అనేది శర్వా మార్కెట్ కే ప్రమాదం. అసలే సినిమా ట్రైలర్ కి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. చిరంజీవి, చరణ్, కె.టి.ఆర్ వంటి మహామహులందరూ ప్రమోషన్స్ లొ పాలుపంచుకొంటున్నప్పటికీ.. సినిమాకి కావాల్సినంత బజ్ మాత్రం క్రియేట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఈ టికెట్ రేట్ హైక్. అన్నీ సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి శర్వా ఇవన్నీ కాస్త పట్టించుకుంటే బెటర్!