Tollywood Heroes: హీరోల ప్రెస్టీజ్ కోసం కలెక్షన్లను మారుస్తున్నారా?
March 14, 2022 / 08:23 PM IST
|Follow Us
మూడు నెలల క్రితం తెలంగాణ సర్కార్ సినిమా థియేటర్లకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెక్లైనర్ సీట్లకు ఏకంగా 350 రూపాయల వరకు టికెట్ రేటు ఉండగా మిగిలిన సీట్లకు గరిష్టంగా 295 రూపాయలు టికెట్ రేటుగా ఉంది. ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకుంటే టికెట్ రేట్లకు సర్వీస్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెద్ద సినిమాలకు మాత్రమే ఈ టికెట్ రేట్లు అమలవుతున్నాయి.
ఈ టికెట్ రేట్లు అమలు చేస్తే చిన్న సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని చిన్న సినిమాల నిర్మాతలు సైతం భావిస్తున్నారు. అయితే నాలుగేళ్ల క్రితం వరకు పెద్ద హీరోల సినిమాలకు నైజాంలో 10 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడమే కష్టమయ్యేది. సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే మాత్రమే పెద్ద సినిమాలు 10 కోట్ల రూపాయల స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉండేది. అయితే తాజాగా టికెట్ రేట్లను పెంచిన తర్వాత పెద్ద సినిమాలు నైజాంలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.
ఏపీలో ఆంధ్ర ఏరియా కలెక్షన్లకు ధీటుగా నైజాం కలెక్షన్లు ఉన్నాయి. అయితే నైజాం కలెక్షన్లలో నిజం లేదని సమాచారం అందుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ హీరోల ప్రెస్టీజ్ కోసం కలెక్షన్లను పెంచి చూపిస్తున్నారని బోగట్టా. కలెక్షన్లకు జీఎస్టీతో పాటు కొంతమొత్తం ఎక్కువ కలిపి కలెక్షన్లను ప్రకటిస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమా నిర్మాతకు మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతకు మాత్రమే అసలు లెక్కలు తెలుస్తాయని బోగట్టా.
అందరు హీరోల సినిమాల విషయంలో ఇదే జరుగుతోందని సమాచారం. పెద్ద హీరోల సినిమాల కలెక్షన్లలో తొలిరోజు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు తేడా ఉండనుందని సమాచారం. తమ హీరోల సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయని భావించే అభిమానులు ఆ కలెక్షన్ల అంకెలు నిజం కాదని తెలిస్తే ఫీలవుతారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.